Harbhajan Singh: నెంబర్ 6లో ఆడాలంటే దమ్ముండాలి! అది పాండ్యాకు టన్నుల కొద్ది ఉంది!

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా రెండు మార్పులు చేయాలని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్‌లను బెంచ్‌కు పరిమితం చేసి వారిస్థానాల్లో ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్‌ను ఆడించాలన్నాడు. అంతేకాకుండా ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడిస్తే పవర్ ప్లేలో టీమిండియా ధాటిగా పరుగులు చేయగలదని అభిప్రాయపడ్డాడు.
ఇక నెంబర్ 6లో హార్దిక్ పాండ్యాను ఆడించాలని, తనదైన రోజున అతన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదన్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన హర్భజన్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ నేపథ్యంలో టీమ్ కాంబినేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇషాన్ కిషన్ ఓపెనింగే చేస్తే..
'ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం చాలా ముఖ్యమనేది నా అభిప్రాయం. అతను గనుక రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తే భారత్‌కు మంచి శుభారంభం దక్కుతుంది.
అతను పవర్‌ప్లేలో బ్యాటింగ్ చేస్తే భారత్ స్కోర్ 60-70 పరుగులు చేస్తుంది. విధ్వంసకర ఆటతీరు కలిగిన అతను క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఇషాన్ ఓపెనర్‌గా వస్తే కేఎల్ రాహుల్‌ను నెంబర్ 4లో ఆడించవచ్చు. అప్పుడు టీమిండియా టాప్-4 బ్యాట్స్‌మన్ బలమైనవారుంటారు. ఆ తర్వాత పంత్ ఐదో స్థానంలో బరిలోకి దిగుతాడు.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

ఆరులో సరైనోడు..
ఇక బౌలింగ్, బ్యాటింగ్ చేయకుండా జట్టుకు భారమైన హార్దిక్ పాండ్యాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా.. భజ్జీ మాత్రం అతనికి అండగా నిలిచాడు. తనదైన రోజున హార్దిక్ పాండ్యాను ఆపడం ఎవరి తరం కాదన్నాడు. 'తనదైన రోజున హార్దిక్ పాండ్యా ఏ బౌలర్‌నైనా చితకబాదుతాడు. అతను బౌలింగ్ చేయకపోయినా తుది జట్టులో ఉండాలి. టీ20 ఫార్మాట్‌లో ఓపెనింగ్ చేయడం, మూడో స్థానంలో ఆడటం సులువే. కానీ ఐదారు స్థానాల్లో బ్యాటింగ్ చేయడం మాత్రం చాలా కష్టం. ఈ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగితే తొలి బంతి నుంచే ధాటిగా ఆడాలి. అందుకు ఆట మీద మంచి అవగాహన ఉండాలి. అది హార్దిక్ పాండ్యాకు మెండుగా ఉంది.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

వరుణ్ ఆకట్టుకుంటాడు..
అనంతరం లోయర్ ఆర్డర్‌పై స్పందించిన హర్భజన్.. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా, ఎనిమిదిలో శార్దూల్ ఠాకూర్, తొమ్మిదిలో బుమ్రా, పదో స్థానంలో షమీ పేర్లను సూచించాడు. అలాగే చివరగా తన కోల్‌కతా నైట్ రైడర్స్ సహచరుడు వరుణ్ చక్రవర్తి పేరు వెల్లడించాడు.'వరుణ్ చక్రవర్తీ చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. కుదురుకోవడానికి సమయం పడుతుంది. త్వరలోనే అందరూ అతని ఆటను చూసి ఆశ్చర్యపోతారు.
అతను గొప్ప మ్యాచ్ విన్నర్ అవుతాడు. టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషిస్తాడు.'అని హర్భజన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. ఈ అనూహ్య పరాజయం తర్వాత ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. కివీస్ సైతం పాక్ చేతిలో ఓటమిపాలవ్వడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. టోర్నీలో ముందుకు సాగాలంటే ఇరు జట్లకూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అఫ్గాన్‌ను లైట్ తీసుకోవద్దు..
అయితే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. అఫ్గాన్ మ్యాచ్‌ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దని భజ్జీ సూచించాడు. 'న్యూజిలాండ్‌తో జరగనున్న పోరు క్వార్టర్ ఫైనల్ లాంటిది ఏమాత్రం కాదు. ఇది కూడా ఒక సాధారణ మ్యాచ్. అయితే అఫ్గానిస్థాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు. అదీ ప్రమాదకరమైన జట్టే. ఏ జట్టునైనా ఓడించగలదు. ఇక భారత్ సెమీస్ చేరాలంటే.. తొలుత చేయాల్సిన పని న్యూజిలాండ్‌ను ఓడించడం.
మన ఆటగాళ్లపై నాకు ఆ నమ్మకం ఉంది. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీసేనకు ప్రతి మ్యాచ్ కీలకమే. అందుకోసం భారత్ సిద్ధంగా ఉందని అనుకుంటున్నా. కచ్చితంగా మనోళ్లు గెలుస్తారనే అనుకుంటున్నా. భారత్ గొప్ప జట్టే అయినా పాకిస్థాన్‌తో తలపడిన రోజు మనదికాదు. ఆ ఓటమి కోహ్లీసేనకు మేలుకొలుపు లాంటిది' అని హర్భజన్ సింగ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications