
న్యూఢిల్లీ: రాజకీయల్లోకి రావడంపై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్లారిటీ ఇచ్చాడు. తన 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు శుక్రవారం వీడ్కోలు పలకడంతో రాజకీయాల్లోకి రానున్నాడనే ప్రచారం జోరుగా సాగింది. దానికి తోడు ఇటీవల అతను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూతో భేటీ అవ్వడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే ఈ ప్రచారంపై హర్భజన్ సింగ్ స్పందించాడు. పంజాబ్ రాష్టానికి తనవంతు సేవ చేస్తానని చెప్పాడు. అయితే అదీ రాజకీయాల ద్వారానా? లేక మరే మార్గం ద్వారానా అనేది ఇంకా నిశ్చయించుకోలేదు.
'ప్రతీ పార్టీలోని నాయకులు నాకు తెలుసు. ఏదైనా పార్టీలో చేరే ముందే నేను అందరికీ చెబుతా. పంజాబ్ రాష్ట్రానికి నా వంతు సేవ చేస్తా. అది రాజకీయాల ద్వారానా, లేక మరే మార్గం ద్వారానా అనేది ఇంకా నిశ్చయించుకోలేదు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటా.'అని హర్భజన్ సింగ్ చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో హర్భజన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 711 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 953 వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్ (687), రవి అశ్విన్ (638), జహీర్ ఖాన్ (597) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
దేశ రాజకీయాలపై హర్భజన్ ఆసక్తికనబరుస్తున్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయించాలని పంజాబ్ కాంగ్రెస్ భావిస్తొందంట. భజ్జీ స్వస్థలం జలంధర్.. ఇది దోబా నియోజవర్గ పరిధిలో ఉంది. ఇక్కడ ఎస్సీ ఓటర్లు ఎక్కువ. ఇక్కడ శిరోమణి అకళిదల్‌ను ఎదుర్కొనేందుకు పంజాబ్ కాంగ్రెస్ భజ్జీని నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్సుంది.