న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియాకు నిరాశే ఎదురైంది. వరుసగా రెండో ఫైనల్లోనూ టీమిండియా ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మెగా మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పేలవ ప్రదర్శనతో 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయం నేపథ్యంలో భారత్‌లో ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది.
దేశంలో అభిమానం హద్దులు ధాటుతోందని, జట్టు కంటే వ్యక్తిగత ఆటగాళ్ల ఆరాధన ఎక్కువైందని, దాంతో ఐసీసీ టోర్నీల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయనే చర్చ ఊపందుకుంది. ముందు గౌతమ్ గంభీర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయగా.. హర్భజన్ సింగ్ కూడా ఆ తరహా వ్యాఖ్యలతోనే ఓ ధోనీ అభిమానికి కౌంటరిచ్చాడు.

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోనే టీమిండియా చివరిసారిగా ఐసీసీ టైటిల్ గెలవడంతో అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోయారు. తమ అభిమాన క్రికెటరే తోపు అంటూ కామెంట్ చేశారు.
'కోచ్, మెంటార్ లేకున్నా.. టీమ్ మొత్తం కుర్రాళ్లతోనే నిండి ఉన్నా... సీనియర్లు కూడా వరల్డ్ కప్ ఆడడానికి ఇష్టపడకున్నా... అంతకుముందు ఒక్క మ్యాచ్ కూడా కెప్టెన్సీ చేసిన అనుభవం లేకపోయినా.. కెప్టెన్ అయిన 48 రోజుల్లోనే ధోనీ టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించాడు.'అని ఓ ధోనీ అభిమాని ట్వీట్ చేయగా.. హర్భజన్ సింగ్ ఘాటుగా బదులిచ్చాడు.
'అవును, భారత్ తరుపున యువ ప్లేయర్ ధోనీ ఒక్కడే అన్నీ మ్యాచులు గెలిచాడు. మిగిలిన 10 మంది ఆడలేదు. ధోనీనే ఒంటరిగా వరల్డ్ కప్ సాధించాడు. విచిత్రం ఏంటంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మరే ఏ దేశం అయినా వరల్డ్ కప్ గెలిస్తే, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది, ఇంగ్లండ్ వరల్డ్ కప్ సాధించింది అని రాస్తారు.
కానీ మన దేశంలో భారత్ గెలిస్తే, కెప్టెన్ ధోనీ గెలిచాడు, కెప్టెన్ రోహిత్ గెలిచాడు అని కెప్టెన్లకు క్రెడిట్ ఇస్తారు. క్రికెట్ అనేది టీమ్ గేమ్. గెలిస్తే అందరు కలిసి గెలుస్తారు, ఓడితే అందరు కలిసి ఓడుతారు.'అని హర్భజన్ సింగ్ కౌంటరిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక భారత్ వేదికగా జరిగే టెస్ట్ మ్యాచ్‌లను స్పిన్నర్ల సాయంతో రెండున్నర రోజుల్లోనే ముగించి.. ఇంగ్లండ్‌లో పేసర్లను బౌలింగ్ చేయమంటే ఎలా? అని కూడా హర్భజన్ నిలదీశాడు. భారత్ వేదికగా జరిగే టెస్ట్‌ల్లో పేసర్లకు ఏ మాత్రం పని ఉండదని, తొలి ఓవర్ నుంచే స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి ఫలితాలు రాబడుతున్నారని తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన పేసర్లను.. ఇంగ్లండ్ కండిషన్స్‌లో వికెట్లు తీయమనడం సబబు కాదన్నాడు. ఇప్పటికైనా బీసీసీ ఈ వ్యవహారంపై దృష్టిపెట్టాలన్నాడు.