పారిస్ ఒలింపిక్స్ 2024 జరుగుతున్న సమయంలో ఒక్క క్రికెట్ మ్యాచ్ కూడా చూడలేదని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. భారత్ వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్ కూడా పట్టించుకోలేదని చెప్పాడు. పూర్తిగా పారిస్ ఒలింపిక్స్‌పైనే ఫోకస్ పెట్టినట్లు తెలిపాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ అథ్లెట్లు తీవ్ర నిరాశపరిచారు.
ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేకపోయారు. కేవలం 6 పతకాలు మాత్రమే గెలిచారు. ఇందులో ఐదు కాంస్య పతకాలు కాగా ఒకటి రజతం. టోక్యో ఒలింపిక్స్(7 పతకాలు) కంటే మెరుగైన ప్రదర్శన చేస్తారని భావించిన భారత ఆటగాళ్లు.. అంతకంటే ఒక్క పతకం తక్కువగానే తీసుకొచ్చారు. మరోవైపు శ్రీలంకతో వన్డే సిరీస్‌ను టీమిండియా 0-2తో చేజార్చుకుంది.

మూడు వన్డేల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. తొలి మ్యాచ్‌ను టై చేసుకున్న రోహిత్ సేన.. చివరి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక స్పిన్ ధాటికి ఘోర పరాజయాలను చవిచూసింది. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఒలింపిక్స్‌తో పాటు భారత్-శ్రీలంక వన్డే సిరీస్‌పై హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'నిజాయితీగా చెప్పాలంటే.. భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా చూడలేదు. ఎందుకంటే నేను పూర్తిగా పారిస్ ఒలింపిక్స్‌నే చూశాను. ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు.. అవి తప్పా మరొకటి చూడలేం. క్రికెట్‌లో కొన్నిసార్లు ఓడినా మరికొన్నిసార్లు గెలుస్తాం. ఆటలో ఇవన్నీ సహజం.
క్రికెటర్లంతా ఈ దశను ధాటాల్సిందే.
కొన్నిసార్లు బాగా ఆడినా విజయం దక్కదు. వన్డే సిరీస్‌లో భారత్ కంటే శ్రీలంక మెరుగైన ప్రదర్శన చేసింది. అందుకే వారు విజయం సాధించారు. పూర్తి క్రెడిట్ వారిదే. ఈ సిరీస్‌లో భారత బౌలర్ల ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. బుమ్రా లేకపోవడం కూడా శ్రీలంకకు కలిసొచ్చింది. కానీ కోహ్లీ, రోహిత్, రాహుల్ వంటి దిగ్గజాలు ఉన్న జట్టుపై శ్రీలంక విజయం సాధించిందంటే.. వారికి ఇది గొప్ప విజయమే. ఈ ఓటమి నుంచి అతి త్వరగా టీమిండియా తేరుకుంటుందని ఆశిస్తున్నా.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
శ్రీలంక పర్యటన అనంతరం టీమిండియా 42 రోజుల సుదీర్ఘ విరామం లభించింది. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లంతా దులిప్ ట్రోఫీ ఆడాలని బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.