టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, అఫ్గానిస్థాన్ జట్లు ఫైనల్ చేరుతాయని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు. టైటిల్ మాత్రం టీమిండియానే గెలుస్తుందన్నాడు.
బంగ్లాదేశ్‌పై సంచలన విజయం సాధించిన అఫ్గానిస్థాన్ తొలిసారి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సౌతాఫ్రికాతో గురువారం ఉదయం తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ గురువారం రాత్రి జరగనుంది.

ట్రినిడాడ్ వేదికగా తొలి సెమీఫైనల్.. గయానా వేదికగా రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండగా.. రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డేలేదు.
ఈ క్రమంలోనే ఫైనల్ చేరే జట్లను హర్భజన్ సింగ్ అంచనా వేసాడు. తొలి సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్, రెండో సెమీఫైనల్లో భారత్ విజేతగా నిలుస్తుందని భజ్జీ జోస్యం చెప్పాడు. ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడుతాయని, భారత్ విజేతగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. జూన్ 29న బార్బోడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
గత టీ20 ప్రపంచకప్ 2024లోనూ భారత్, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్లోనే తలపడ్డాయి. 10 వికెట్లతో టీమిండియాను ఓడించి ఫైనల్ చేరిన ఇంగ్లండ్.. పాకిస్థాన్‌పై గెలిచి టైటిల్‌ను అందుకుంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా తాజా ఎడిషన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ తడబడుతూనే సెమీస్ చేరింది. ఈ క్రమంలోనే సెమీఫైనల్-2లో టీమిండియా.. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా మరో ఐసీసీ టైటిల్ గెలవలేదు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓటమిపాలై తృటిలో టైటిల్‌ను అందుకోలేకపోయింది.
ఈ సారైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనే కసితో ఉంది. గతంలో కంటే ప్రస్తుతం టీమిండియా బలంగా ఉంది. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా సమష్టి ప్రదర్శనలతో విజయాలను అందుకుంది. మ్యాచ్‌కు ఒకరు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అంతేకాకుండా ఇంగ్లండ్‌పై బుమ్రాకు మెరుగైన రికార్డు ఉంది.
బుమ్రాను అడ్డుకోవడం ఇంగ్లండ్ బ్యాటర్లకు అతిపెద్ద సవాల్. అతని 24 బంతులను సమర్థవంతంగా ఆడితే తిరుగుండదు.