అతనిలాంటి ఆటగాడిని చూడలేదు.. చెప్పి మరి సిక్స్ కొట్టాడు: హర్భజన్ సింగ్
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైభవ్ లాంటి ఆటగాడిని తాను ఇప్పటివరకు చూడలేదని కొనియాడాడు. వైభవ్ అత్యంత ప్రతిభావంతమైన ఆటగాడని, గతంలో ఏ ఆటగాడు సాధించని ఘనతను అందుకుంటున్నాడని కితాబిచ్చాడు.
ఇంగ్లండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ మరో కీలక పోరుకు సిద్దమయ్యాడు. ఇంగ్లండ్‌తో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్.. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. గురువారం హరారే వేదికగా జరిగే మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో జియోస్టార్ షోలో మాట్లాడిన హర్భజన్ సింగ్.. వైభవ్ సూర్యవంశీ ఫియర్‌లెస్ బ్యాటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అతి పెద్ద మార్పు ఇదే..
'ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్నట్లు గతంలో ఎవరూ ఆడలేదు. అతను అసాధారణ నైపుణ్యం కలిగిన ప్లేయర్. ఇలాంటి ఆటగాడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఒకప్పటి యువతకు.. ఇప్పటి కుర్రాళ్లకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం మీడియా, సోషల్ మీడియా. అప్పట్లో కూడా ఇలాంటి ఆటగాళ్లు ఉన్నారేమో. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నారు.ఫియర్‌లెస్ మనస్తత్వం, తమకు నచ్చే విధంగా ఆడే ఆటగాళ్లను జనాలు అంగీకరించడమే ఆటలో వచ్చిన అతి పెద్ద మార్పు.'అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
చెప్పి మరి సిక్స్ బాదాడు..
వైభవ్ ఐపీఎల్ అరంగేట్రానికి ముందు జరిగిన ఓ సంఘటనను కూడా హర్భజన్ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. 'రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉన్న సమయంలో వైభవ్ సూర్యవంశీని తొలి బంతిని ఎలా ఆడుతావు? అని అడిగాడు. దానికి వైభవ్.. అది నా జోన్‌లో ఉంటే సిక్స్ బాదుతానని బదులిచ్చాడు. అన్నట్లుగానే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బంతినే సిక్స్ బాది తన ఐపీఎల్ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. ఇది వైభవ్ ఫియర్‌లెస్ మనస్తత్వాన్ని తెలియజేస్తోంది'అని తెలిపాడు.
తన కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సలహాను ఎప్పటికీ మర్చిపోనని హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. 'క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నాకు ఇచ్చిన సలహాను నేను ఎప్పటికీ మర్చిపోను.
ఆట కంటే ఎవరూ గొప్ప కాదు..
'నీ క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఎన్నో విషయాలు నీ దారిలోకి వస్తాయి. కానీ ఎటువైపు నీ మనసును మళ్లించకుండా ఆటపై మాత్రమే దృష్టిని పెట్టాలి. ఇలా కొనసాగితేనే ఈ ప్రపంచంలో నిన్ను ఎవరూ ఆపలేరు. నువ్వు ఏది అవ్వాలనుకున్నా.. ఏది చేయాలనుకున్నా.. నువ్వు సరైన మార్గంలో నడిస్తేనే.. అన్ని రకాల గౌరవం, కీర్తిని పొందుతావు.'అని సచిన్ పాజీ నాకు చెప్పాడు.'అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
ఇదే సలహాను వైభవ్ సూర్యవంశీతో పాటు ఈ తరం యువ ఆటగాళ్లకు ఇవ్వాలనుకుంటున్నాను. 'ఆటపైనే ఫోకస్ పెట్టాలి. ఆట కంటే మనం పెద్ద కాదనే విషయాన్ని గ్రహించాలి. ఈ ఆట వల్లే మనం ఈ స్థాయికి వచ్చామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీ వైఖరి సరిగ్గా లేకపోతే.. ఈ ఆట ఏంత ఇచ్చిందో అంతే వేగంగా వెనక్కి తీసుకుంటుంది.'అని హర్భజన్ సింగ్ హెచ్చరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

