
చెన్నై: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హీరోయిన్‌తో కలిసి చిందులేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన భజ్జీ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడు. 'ఫ్రెండ్‌షిప్' పేరిట తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. ఓ పాట చిత్రీకరణలో భాగంగా తీసిన ఫొటోలను ఈ వెటరన్ స్పిన్నర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ వేసవిలో థియేటర్లలో సందడి చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. ఆ ఫొటోల్లో భజ్జీ కళ్లోజోడు, తెల్ల బూట్లతో లుంగీ పైకి చుట్టి స్టెప్పులేస్తున్నాడు. ఈ ఫొటోలను పంచుకుంటూ భజ్జీ భావోద్వేగానికి లోనయ్యాడు. తమిళ సంప్రదాయ వస్త్రధారణ (ధోతి) ధరించానని చెబుతూ.. 'తమిళనాడు నన్ను తల్లిలా ఆదరించింది'అని తమిళంలో ట్వీట్ చేశాడు. గతంలో చెన్నె సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా హర్బజన్ సింగ్ గుర్తుచేసుకున్నాడు.
కాగా, ఈ సినిమా గతేడాదిలోనే పూర్తి కావాల్సి ఉన్నా..లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. తాజాగా చివరి షెడ్యూల్ చిత్రీకరిస్తున్నట్లు భజ్జీ ట్విటర్ వేదికగా స్పష్టం చేశాడు. ఈ వేసవిలో విడుదలవుతుందని చెప్పాడు. బిగ్‌బాస్-3 ఫేమ్ లోస్లియా భజ్జీకి జోడీగా నటిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ లోస్లియాతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. జాన్ పాల్‌రాజ్, శ్యామ్ సూర్య నిర్మాణంలో ఫ్రెండ్‌షిప్ సినిమా రూపుదిద్దుకుంటోంది. యాక‌్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మరోవైపు హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ఐపీఎల్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వ్యక్తిగత కారణాలతో గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడలేకపోయాడు. ఇక త్వరలో జరిగే మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అయితే ఈ వెటరన్ స్పిన్నర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకోగా.. బీసీసీఐ విడుదల చేసిన 292 మంది(వేలంలో పాల్గొనే ఆటగాళ్లు) జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. దీంతో గురువారం అతడిని ఏ జట్టు కొనుగోలు చేస్తుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది.'