దేశంలో 1.2 బిలియన్ దివ్యాంగులకు టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. ఎవరి మనోభావాలను కించపర్చడం తన ఉద్దేశం కాదని, తెలియక జరిగిన తప్పుకు మన్నించాలని కోరాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ నెగ్గిన జోష్‌లో హర్భజన్ సింగ్‌తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌పై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశం మొత్తం హీరోలుగా పరిగణించే వ్యక్తులు ఇంతలా దిగజారుతారా? అని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ గెలిచిన అనంతరం యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా.. బాలీవుడ్ మూవీ 'బ్యాడ్ న్యూస్'లోని తౌబా తౌబా హుక్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తూ రీల్ చేశారు.

ఇందులో వారు నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడుస్తూ కనిపించారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. '15 రోజుల లెజెండ్స్ క్రికెట్ తర్వాత మా శరీరాలు కూడా తౌబా తౌబా అయ్యాయి. శరీరంలో ప్రతీ అవయవం నొప్పిగా ఉంది. ఇది మా వెర్షన్ 'తౌబా తౌబా' అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, కరణ్‌కు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
దీనిపై అభిమానులు సానుకూలంగా కామెంట్లు చేయగా.. దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శిస్తున్నారు. పారా అథ్లెట్లు సైతం ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లపై దుమ్మెత్తి పోసారు. దాంతో హర్భజన్ సింగ్ ఆ రీల్ వీడియోను తొలగించడంతో క్షమాపణలు చెప్పాడు.
ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఆ వీడియో తీయలేదని, 15 రోజులు ఆడిన తర్వాత నొప్పులతో తమ శరీరాలు అలా అయ్యాయని చెప్పే ప్రయత్నం చేశామన్నాడు. తెలియక జరిగిన తప్పుకు మన్నించాలని కోరాడు.
'ఇంగ్లండ్‌లో ఛాంపియన్‌షిప్ గెలిచిన అనంతరం మేం చేసిన టౌబా టౌబా రీల్‌పై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలనుకుంటున్నా. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. ప్రతీ ఒక్కరిని మేం గౌరవిస్తాం. ఈ టోర్నీ ఆడిన తర్వాత మా నొప్పుల బాధను తెలియజేసేందుకే ఈ వీడియో చేశాం. ఎవర్ని కించపర్చడం మా ఉద్దేశం కాదు. ఇప్పటికీ ఎవరైనా మేం తప్పు చేశామని భావిస్తే వారందరికి మా క్షమాపణలు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.'అని సుదీర్ఘ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.