For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాల్ బాయ్ నుంచి వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా.. శతకవీరా సరిలేరు నీకెవ్వరూ!

శతకవీరా నీకు వందనం.. ద్విశతకధీరా నీకు అభివందనం..! నీవో పరుగుల యంత్రం.. దాసోహం నీకు మైల్ స్టోన్ మంత్రం..! నీవు ఆడితే ఓ విజయం.. నీవు నిలబడితే ఓ ప్రభంజనం..!

వయసుకు మించిన పరిణతి.. శిఖరాన్ని మించిన ఆట.. ప్రపంచాన్ని జయిస్తున్న రికార్డుల వేట..! సారథిగా సరిలేరు నీకెవ్వరూ..ప్లేయర్‌గా సరిరారు నీకెవ్వరూ..! ఇక నిలువదు ఏ రికార్డు మున్ముందు.. శతకాల అర్థసెంచరీని మించావు.. క్రికెట్ దేవుడి దరి చేరుతున్నావు..! టన్నుల కొద్ది పరుగుల చేస్తున్నావు.. దిగ్గజాలను కనుమరుగు చేస్తున్నావు..! నీ ఆటను ఇలానే కొనసాగించు.. మమ్మల్ని అలానే అలరించు..!

Happy Birthday Virat Kohli Here s All You Need To Know About His Cricket Journey

సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అంతా ఒకవైపు.. విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఒక వైపు.. ఒకప్పుడు అతని మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే 'మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లీ ఉన్నాడు..!

అని ప్రతి కెప్టెన్‌ తమ ఆటగాళ్లను హెచ్చరించే అంతా.. ఒకప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా.. అతి తక్కువ సమయంలోనే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ ఆటగాడిగా అవతరించాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్‌ ముఖచిత్రంగా ఎదిగిన ఈ స్టార్ ప్లేయర్ మంగళవారం(నవంబర్ 5)తో 36వ ఏట అడుగెడుతున్న సందర్భంగా అతని కెరీర్ విశేషాలు..

బాల్‌ బాయ్‌గా..
ఢిల్లీలో భారత్‌ టెస్టు మ్యాచ్‌ ఆడుతోంది. బౌండరీ లైన్‌ వద్ద మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఫీల్డింగ్‌. గీత అవతల ఉన్న ఓ 10 ఏళ్ల పిల్లాడు ఒక్కసారైనా తనవైపు చూడకపోతాడా అని ఆశతో చేయి ఊపుతూనే ఉన్నాడు. ఆ పిల్లాడి ఉత్సాహం గమనించిన సెహ్వాగ్‌ ఓ చిరు నవ్వు నవ్వాడు. అంతే ఆ పిల్లాడు పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు.

Happy Birthday Virat Kohli Here s All You Need To Know About His Cricket Journey

ఆ పిల్లాడు కోహ్లీనేనని 16 ఏళ్ల తర్వాత సెహ్వాగ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాట.. 'కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తుంటే కళ్లు పక్కకు తిప్పలేం, నా పిల్లలు నా బ్యాటింగ్‌ కంటే విరాట్‌ బ్యాటింగే ఇష్టపడతారు.' కోహ్లీ ఏ క్రికెటర్‌ పలకరింపు కోసం ఎదురు చూశాడో ఆ క్రికెటర్‌తో ఆడటమే కాకుండా అతని నుంచి ప్రశంసలు పొందాడు. ఇలా అతను ఆరాధ్య దైవంగా భావించిన.. ఒక్కసారైన చూడాలనుకున్న క్రికెటర్లందరితోను ఆడటమే కాక వారి మన్ననలు పొందాడు.

నాన్న చనిపోయినా..
2006లో ఢిల్లీ- కర్ణాటక రంజీ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కోహ్లీ తండ్రి ప్రేమ్‌ కోహ్లీ చనిపోయాడన్న సమాచారం అందింది. కీలక మ్యాచ్‌లో 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో ఉంది. అప్పటికే కోహ్లీ ఓవర్‌నైట్‌ 40 స్కోరుతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ విషయాన్ని కోచ్‌ ముందు ప్రస్తావించగా అతను ఇంటికెళ్లమని సూచించాడు.

అయినా అతడి భావోద్వేగాలు అదుపు తప్పలేదు. అప్పటికే అతని నరనరాల్లోకీ క్రికెట్‌ ఎక్కేసింది. దానికంటే ఏదీ ఎక్కువ కాదనే నిర్ణయానికి వచ్చేశాడు. కాదు.. తండ్రే అతడికా విషయాన్ని నూరిపోశాడు. అందుకే దుఃఖాన్ని దిగమింగుకొని బ్యాటింగ్‌ కొనసాగించాలనీ, శతకం చేసి తండ్రికి అంకితమివ్వాలనీ నిర్ణయించుకున్నాడు.

కానీ తొంబై పరుగుల వద్ద అంపైర్‌ తప్పిదం వల్ల అవుటైన కోహ్లీ, శతకం చేయకపోయినా ఆ స్ఫూర్తికి తండ్రి సంతోషించే ఉంటాడన్న నమ్మకంతో నేరుగా అంత్యక్రియలకు బయల్దేరాడు. ఆ రాత్రి నుంచీ తామంతా ఓ కొత్త కోహ్లీని చూశామని తెలిపింది విరాట్‌ తల్లి సరోజ్‌. కోహ్లీ ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి నుంచి గట్టెక్కింది.

Happy Birthday Virat Kohli Here s All You Need To Know About His Cricket Journey

అండర్‌-19 ప్రపంచకప్‌ విజయంతో..
2008 అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు సారథ్యం వహించిన కోహ్లీ ఓ కొత్త ఛాంపియన్‌గా నిలిచాడు. సిరీస్‌లో భారీ లక్ష్యాలను బ్యాటుతో అవలీలగా ఛేదిస్తూ, సందర్భానికి తగ్గట్లు బౌలర్లనూ, ఫీల్డర్లనూ మారుస్తూ ఆల్‌రౌండ్‌ ఆటగాడిగా అదరగొట్టాడు. భారత్‌ను అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలబెట్టాడు. దీంతో రాత్రికి రాత్రే భవిష్యత్తు తారగా ముద్ర వేసుకున్నాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ నుంచి పిలుపొచ్చింది.

ఆ పైన శ్రీలంకతో సిరీస్‌కు సచిన్‌, సెహ్వాగ్‌ గాయాల కారణంగా దూరమవడంతో అనూహ్యంగా కోహ్లీకి జట్టులో చేరే అవకాశం లభించింది. అలా ఊహ తెలిసినప్పట్నుంచీ భారత్‌కు ఆడాలని తండ్రితో కలిసి కోహ్లీ కన్న కల పందొమ్మిదేళ్ల వయసులో నెరవేరింది. ఆ సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో కోహ్లీ అర్ధ శతకంతో టోర్నీ భారత్‌ సొంతమైంది. అక్కడితో తన రాత మారిపోయిందనుకున్న కోహ్లీ ఆశ అంత సులువుగా తీరలేదు.

ఆరంభంలో ఇబ్బందులు..
ఎంతటి స్థాయి వ్యక్తికైనా జీవితంలో ఒడిదుడుకులు ఉండటం సహజమే. కోహ్లీ విషయంలోను అదే జరిగింది. వన్డే క్రికెట్‌లో తన ప్రస్థానాన్ని బాగానే ప్రారంభించినా, తరవాతి సిరీస్‌కు సచిన్‌, సెహ్వాగ్‌ అందుబాటులోకి రావడంతో కోహ్లీ స్థానం బెంచికే పరిమితమైంది.

ఆ తరవాతి సిరీస్‌లో ఏకంగా అతడి చోటే గల్లంతయ్యింది. ఆపైన ఎవరైనా గాయాలపాలైన సందర్భంలో వచ్చిన అవకాశాల్ని రెండు చేతులా అందుకుంటూ, తనను తొలగించలేని పరిస్థితిని సెలెక్టర్లకు కల్పించాడు. ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా ఎదిగాడు.

Story first published: Tuesday, November 5, 2024, 10:32 [IST]
Other articles published on Nov 5, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+