
నా ఆటపై నమ్మకం పెరిగింది
సన్నాహక మ్యాచ్ అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. '2018-19 ఆస్ట్రేలియా సిరీస్ నా కెరీర్‌లో రెండో విదేశీ పర్యటన. అప్పుడు ఆసీస్ పర్యటనను సవాలుగా భావించా. జట్టు విజయాల్లో చిన్నపాత్ర పోషించా. అయితే ఇప్పుడు నా ఆటతీరు, గేమ్ ప్లాన్‌తో పరుగులు చేయడానికి సిద్ధంగా ఉన్నా. అయితే ఆసీస్‌లో బౌన్సర్లు కీలకపాత్ర పోషిస్తాయి. వాటిని పరిస్థితులకు తగ్గట్టుగా ఎదుర్కోవడానికి మేం సిద్ధమయ్యాం' అని విహారి తెలిపాడు. చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె ఆటను బాగా అర్థం చేసుకుంటారని, అంతేగాక సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తారన్నాడు.

ఎక్కడైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధం
సాధారణంగా టెస్టుల్లో ఆరో స్థానంలో ఆడే హనుమ విహారి వార్మప్ మ్యాచ్‌ల్లో నాలుగు, అయిదు స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. జట్టు అవసరాలను బట్టి ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి, ఎన్ని ఓవర్లు బౌలింగైనా వేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. 'ఆస్ట్రేలియా పిచ్‌లపై అధిక బౌన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ సవాలును ఎదుర్కొనేందుకు మేం సిద్ధమయ్యాం. ఎర్ర బంతితో పోలిస్తే.. గులాబి బంతితో ఎక్కువ పేస్, బౌన్స్ లభిస్తాయి. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆ బంతి బ్యాట్ మీదకు వస్తుంది. దానికి అలవాటు పడడం కష్టమే కానీ జట్టు తొలి టెస్టుకు మెరుగ్గానే సిద్ధమైంది' అని విహారి తెలిపాడు.

ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు
ఆస్ట్రేలియా-ఎతో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచులో వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీ చేయగా.. రెండో సన్నాహక మ్యాచ్‌లో రిషబ్ పంత్ మెరుపు శతకం బాదాడు. దీంతో తుది జట్టులో వికెట్ కీపర్‌గా వీరిద్దరిలో ఎవరికి అవకాశం వస్తుందని ఆసక్తి నెలకొంది. దీనిపై విహారి స్పందిస్తూ.. 'జట్టులో ఆరోగ్యమైన పోటీ ఎప్పుడూ మంచిదే. అయితే జట్టులో ప్రతీ స్థానానికి పోటీ ఉంది. ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనేది జట్టు యాజమాన్యం నిర్ణయిస్తుంది. సాహా, పంత్ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. వారిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కఠినమైన నిర్ణయం. ఇది యాజమాన్యంకు తలనొప్పే' అని విహారి చెప్పాడు.

సాహాకు బదులుగా పంత్
సాహాకు బదులుగా పంత్ జట్టులోకి వస్తాడని వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సాహా ఫీల్డింగ్ చేయగా.. పంత్ కీపింగ్ చేశాడు. ఇక ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కావడం పంత్‌కు కలిసొచ్చే అంశం. టీమిండియా టెస్టు జట్టులో జడేజా, పంత్ మినహా ఎవరూ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ లేరు. జడేజా గాయంతో తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో పంత్‌కు అవకాశాలు మరింత పెరిగాయి. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.


Click it and Unblock the Notifications

'గిల్, షా వద్దు.. ఓపెనర్‌గా రాహుల్‌ను ఆడించాలి'










