ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)పై సంచలన ఆరోపణలు చేసిన టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, తెలుగు తేజం హనుమ విహారి.. ఈ వ్యవహారంపై మరింత క్లారిటీ ఇచ్చాడు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఓ ప్లేయర్‌ను తిట్టానని తనను ఆంధ్ర జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని సోషల్ మీడియా వేదికగా హనుమ విహారి ఆరోపించిన విషయం తెలిసిందే.
రాజకీయ నాయకుడైన సదరు ప్లేయర్ తండ్రి తన పలుకుబడితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై ఒత్తిడి తెచ్చి తనపై చర్యలు తీసుకునేలా చేసాడని పేర్కొన్నాడు. దాంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. సదరు ప్లేయర్‌తో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సైతం హనుమ విహారిపై సంచలన ఆరోపణలు చేసింది.

హనుమ విహారి ఆరోపణలు అవాస్తవమని, అతను ఆటగాళ్లను బెదిరించి తనకు అనుకూలంగా లేఖను రాయించుకున్నాడని, అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని చాలా మంది ఆటగాళ్లు అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారని ఏసీఏ ఓ సుదీర్ఘ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు సదరు యువ ప్లేయర్ కేఎన్ పృథ్వీ రాజ్ మాత్రం సానుభూతి గేమ్స్ ఆడుకోమ్మని బదులిచ్చాడు.
కేఎన్ పృథ్వీ రాజ్ తండ్రి సైతం హనుమ విహారిపై సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడిని అసభ్య పదజాలంతో దూషించడంతోనే అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. కెప్టెన్సీ మార్పు వ్యవహారం తనకు తెలియదన్నారు. ఈ క్రమంలోనే హనుమ విహారి మరింత క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశాడు.
తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నాడు. తాను ఎలాంటి అసభ్య పదజాలం వాడలేదని చెప్పాడు. 'నేను ఒక ఆటగాడిని అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు.
17వ ప్లేయర్ అయిన సదరు ఆటగాడు నిబంధనలకు విరుద్దంగా మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లోకి రావడంతో నేను అతడిని మందలించాను. కానీ సదరు ప్లేయర్ ఆ ఘటనను తప్పుగా చిత్రీకరించాడు. తన తండ్రికి ఫిర్యాదు చేయడంతో ఘటన మొత్తం నాకు ప్రతికూలంగా మారిపోయింది. నేనేమి తప్పు చేయకపోయినా నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు.
అయినా ఆటపై ఉన్న ప్రేమతోనే జట్టులోనే కొనసాగాను. ఆటపై నాకు చాలా గౌరవం ఉంది. రంజీ టోర్నీలో ఆంధ్రా పోరాటం ముగిసిన తర్వాత నేనే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాను. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఈ పోస్ట్ పెట్టాను. గత నెలలోనే ఈ ఘటన జరిగింది. అయినా నా మనసులోనే పెట్టుకున్నా.
కొన్నేళ్లుగా రాష్ట్ర, జాతీయ జట్టుకు ఆడుతున్న నాకు ఇది చాలా అవమానంగా అనిపించింది. అప్పుడు జట్టు కోసం ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఇప్పుడు నా కోసం నేను నిలబడాలని కోరుకున్నా. లేకుంటే నన్ను నేను క్షమించుకోలేను.'అని విహారి చెప్పుకొచ్చాడు.