టీమిండియా వెటరన్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారి యూటర్న్ తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ జట్టుకు ఆడాలనే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆంధ్ర జట్టులోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారిన సమీకరణాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆంధ్ర జట్టులోనే కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పాడు. మంగళవారం హనుమ విహారి ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హనుమ విహారి గత ప్రభుత్వం కారణంగా తాను ఎంతో బాధపడ్డానని తెలిపాడు.

టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాననే గౌరవం కూడా లేకుండా ఎంతో అవమానించారని, చాలా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వేదింపులు తట్టుకోలేకనే ఆంధ్ర జట్టును వీడాలనుకున్నానని, ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేస్తే ఇవ్వకుండా తనను హింసించారని ఆరోపించాడు.
తాజాగా మంత్రి నారా లోకేష్‌ను కలిశాక భరోసా లభించిందని, ఆంధ్రా జట్టు తరఫున ఆడేందుకు నిర్ణయించుకున్నాని చెప్పాడు. తిరిగి ఆంధ్ర జట్టులో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని, నారా లోకేష్ అండదండలతో ఆంధ్ర క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తానన్నాడు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు హనుమ విహారి అప్పటి ప్రభుత్వం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. జట్టులోని వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ కార్పోరేటర్ కొడుకును తిట్టాననే కారణంతో తనను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.
అయితే ఈ ఆరోపణలను అప్పట్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఖండించింది. కుర్రాళ్ల పట్ల హనుమ విహారి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించింది. కెప్టెన్సీ మార్పు వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ఏసీఏ సెలెక్టర్ల నిర్ణయమని స్పష్టం చేసింది.