ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించడంపై టీమిండియా వెటరన్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారి సంతోషం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి సభ్యులు 160 ప్లస్ సీట్లలో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
మరోవైపు 151 సీట్లతో అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ 20 లోపు సీట్లకే పరిమితమైంది. ఈ విజయం పవన్ కళ్యాణ్ పదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని హనుమ విహారి అభిప్రాయపడ్డాడు. 'పదేళ్ల పట్టుదల, ప్రణాళిక.. ఇప్పుడు పవర్. ఘన విజయం సాధిస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేశ్‌కు శుభాకాంక్షలు'అని హనుమ విహారి ట్వీట్ చేశాడు.

ఎన్నికలకు ముందు హనుమ విహారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)లోనూ వైఎస్సార్‌సీబీ తలదూర్చిందని, తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఏసీఏ రాజకీయాలకు తాను బలయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఓ వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్ కొడుకును తిట్టానని తనను ఆంధ్ర జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై యుద్దాన్నిప్రకటించాడు. ఆ సమయంలో హనుమ విహారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. హనుమ విహారికి మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.
ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఓటమిపై హనుమ విహారి సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. మరో తెలుగు క్రికెటర్, జనసేన స్టార్ క్యాంపైనర్ అంబటి రాయుడు సైతం కూటమి విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. 'ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొప్ప విజయం. భారీ విజయం సాధించిన జనసేన, టీడీపీ, బీజేపీకి శుభాకాంక్షలు.
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమష్టిగా పోరాడారు. వాళ్ల నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. తన పాదయాత్రతో ఈ అఖండ విజయానికి బలాన్ని, ఊపును తీసుకువచ్చిన నారా లోకేశ్‌కు ప్రత్యేక అభినందనలు'అని రాయుడు ట్వీట్ చేశాడు.
వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరిన రాయుడు.. అంతవేగంగా యూటర్న్ తీసుకొని జనసేనలో చేరాడు. జనసేన స్టార్ క్యాంపైనర్‌గా కూటమికి మద్దతుగా ప్రచారం చేశాడు.