
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా టోక్యో ఒలింపిక్స్ ఫీవర్ నడుస్తోంది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మెగా ఈవెంట్ ప్రారంభమైన రోజే భారత్ పతకాల ఖాతా తెరించింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సిల్వర్ మెడల్ గెలవడంతో ఈ సమ్మర్ గేమ్స్‌లో భారత అథ్లెట్ల ప్రదర్శనపై దేశ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే వాస్తవాలు తెలుసుకోకుండా కొంత మంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. హంగరీ వేదికగా జరిగిన వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం జరిగిన 73 కేజీల విభాగం ఫైనల్లో బెలారస్ ప్రత్యర్థి కెనియా పటపోవిచ్‌పై 5-0 తేడాతో ప్రియా మాలిక్ విజయం సాధించి పసిడిని సొంతం చేసుకుంది.
అయితే కొంతమంది ఔత్సాహికులు ఆమె విజయాన్ని టోక్యో ఒలింపిక్స్ ఖాతాలో జమచేస్తూ భారత్ స్వర్ణం గెలిచిందని సంబురపడుతున్నారు. సాధారణ జనమే కాకుండా అంతర్జాతీయ క్రికెటర్లు సైతం ఈ విషయంలో బోల్తా పడ్డారు. టోక్యోలో స్వర్ణం గెలిచిందని భావించి ట్విటర్ వేదికగా ప్రియా మాలిక్‌కు అభినందనలు తెలిపారు. తీరా వాస్తవం తెలుసుకొని ట్వీట్లు తొలగించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లు హనుమ విహారీ, ఇషాంత్ శర్మ ఇలానే పప్పులో కాలేసారు. 'ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన ప్రియా మాలిక్‌కు అభినందనలు'అని ఇషాంత్ శర్మ ట్వీట్ చేయగా.. 'టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం. ప్రియా మాలిక్‌కు హృదయపూర్వక అభినందనలు. దేశం మొత్తం గర్విస్తుంది'అని హనుమ విహారీ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత వాస్తవం తెలుసుకొని డిలీట్ చేయగా.. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. నెటిజన్లు వారిని ఓ ఆట ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం చాలా మంది ఒలింపిక్స్‌లో ప్రియా మాలిక్ స్వర్ణం గెలిచిందని పొరపాటుపడుతూ అభినందనలు తెలుపుతున్నారు.

ఒలింపిక్స్ మూడో రోజు భారత్‌కు నిరాశే ఎదురైంది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత షూటర్ మనూ భాకర్ తీవ్రంగా నిరాశపరించింది. మెడల్ ఈవెంట్ ఇదొక్కటే జరగడంతో ఆదివారం భారత్ ఖాతాలో మెడల్ లేకుండా పోయింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాక్సర్ మేరీకోమ్ తమ తొలి రౌండ్లలో విజయం సాధించగా.. టెబుల్ టెన్నిస్ స్టార్ మానికా బాత్రా మూడో రౌండ్‌కు చేరింది.