భారత్‌ను కెలికిన పాకిస్థాన్.. ఎగతాళి చేస్తూ వివాదాస్పద ప్రోమో!
భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్ మరోసారి కెలికింది. షేక్ హ్యాండ్ వివాదాన్ని గుర్తు చేస్తూ కవ్వింపులకు దిగింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తాజాగా విడుదల చేసిన ప్రోమో నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ప్రొమోలో భారత్‌ను ఎగతాళి చేస్తూ.. వీడియోను రూపొందించింది. భారత్ పేరు ప్రస్తావించకుండా మర్యాద తెలియని మనుషులని ఎద్దేవా చేసింది.
ప్రోమోలో ఏం ఉందంటే?
ఈ ప్రోమోలో ఒక ఆస్ట్రేలియా పర్యాటకుడు పాకిస్థాన్‌లో పర్యటిస్తూ అక్కడి ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నట్లు చూపించారు. ఈ వీడియో చివర్లో ఆ పర్యాటకుడు టాక్సీ దిగి వెళ్తుండగా.. డ్రైవర్ పిలిచి 'షేక్ హ్యాండ్ ఇవ్వడం మర్చిపోయారు. బహుషా మీరు మా పొరుగు దేశం(భారత్‌లో) పర్యటించి వచ్చినట్లున్నారు.'అని నవ్వుతూ అంటాడు. పాకిస్థానీయులకు ఆతిథ్య మర్యాదాలు తెలుసని, పొరుగు దేశం వారు మర్యాద తెలియని వ్యక్తులని ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

షేక్ హ్యాండ్ వివాదం ఏంటంటే?
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా కప్ 2025 సందర్భంగా పాకిస్థాన్ ఆటగాళ్లకు కరాచలనం ఇవ్వకపోగా.. ఆ దేశానికి చెందిన ఏసీసీ ప్రెసిడెంట్ మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని కూడా స్వీకరించలేదు.
ఈ టోర్నీలో పాకిస్థాన్‌ను భారత్ మూడు సార్లు చిత్తు చేసింది. పాకిస్థాన్ మాత్రం భారత ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. కేవలం భారత పురుషుల జట్టే కాకుండా.. భారత మహిళల జట్టు, అండర్-19 జట్లు కూడా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. దాంతో ప్రొమోతో పాకిస్థాన్ బదులిచ్చే ప్రయత్నం చేసింది.
ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు పాకిస్థాన్.. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు లాహోర్ వేదికగా మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్ నేపథ్యంలో ప్రొమోను విడుదల చేసిన పాకిస్థాన్.. భారత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ ప్రోమోపై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించి ఆటపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications