
ముంబై: అప్‌కమింగ్ ఐపీఎల్ 2020 సీజన్‌లో గువహతిలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన గువాహటిలోనే బరస్పరా స్టేడియంలో ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా జరగలేదు.
అయితే ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ గువహతి వేదికగా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ టోర్నీ నిబంధనల ప్రకారం.. లీగ్ దశలో ప్రతి జట్టూ 14 మ్యాచ్‌లు ఆడనుండగా.. ఇందులో ఏడు మ్యాచ్‌ల్ని తమ హోం గ్రౌండ్‌లో ఆడే వెసులబాటు ఉంటుంది. అయితే ఇప్పటికే తమ సొంతగడ్డగా జైపూర్‌ను నిర్ణయించుకున్న రాజస్థాన్ రాయల్స్.. రెండో హోం గ్రౌండ్‌గా గౌహతిలోని బరస్పరా స్టేడియాన్ని ఎంచుకుంది. దీంతో ఓ రెండు మ్యాచ్‌లను బరస్పరా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో నిర్వహించనున్నట్లు బీసీసీఐ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 5న ఢిల్లీ క్యాపిటల్స్, 9న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌ల్ని గువహతిలోనే ఆడబోతున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కూడా స్పష్టం చేసింది. ఈ రెండు మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకి ప్రారంభంకానున్నాయి. మిగిలిన ఐదు మ్యాచ్‌లూ జైపూర్ వేదికగానే రాజస్థాన్ ఆడనుంది.
ఐపీఎల్ 2019 సీజన్‌లో కనీసం ప్లేఆఫ్‌కు చేరని రాజస్థాన్ రాయల్స్.. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడి 11 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈ సీజన్‌లోనైనా పుంజుకోవాలని భావిస్తోంది.