
మన గుంటూరోడే..
షేక్ రషీద్ స్వస్థలం గుంటూరు జిల్లా.. ప్రత్తిపాడులోని మల్లయ పాలెం. తండ్రి బలీషా వలీ లోన్ రికవరీ ఏజెంట్‌గా పనిచేసే చిరుద్యోగి. వలీ సంపాదన అంతంత మాత్రమే అయినా కొడుకు ఆసక్తిని గమనించి అతడికి ఏడేళ్ల వయసునుంచే క్రికెట్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. తొమ్మిదో ఏటనే అండర్-14 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రషీద్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అంతర్ జిల్లాల పోటీల్లో భాగంగా శ్రీకాకుళంపై పన్నెండేళ్ల వయస్సులోనే ట్రిపుల్ సెంచరీ కొట్టిన రషీద్‌ను స్థానికులు చిచ్చర పిడుగుగా పిలుస్తుంటారు.
కోచ్ కృష్ణారావు దగ్గర క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న ఈ కుర్రాడు ప్రస్తుతం ఆంధ్ర అండర్-19 టీమ్ చీఫ్ కోచ్ జ్ఞానేశ్వరరావు దగ్గర రాటు దేలాడు. బంతిని అంచనా వేయడంలో, షాట్ల ఎంపికలో అద్భుతమైన నైపుణ్యం దొరకబుచ్చుకున్న రషీద్ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే కనీసం హాఫ్ సెంచరీ బాదకుండా పెవిలియన్ చేరడు. విరాట్ కోహ్లీని అమితంగా ఆరాధించే రషీద్‌కు అతని పోరాట పటిమంటే చాలా ఇష్టం. సీనియర్లు శ్రీకర్ భరత్, కేవీ శశికాంత్‌తో సన్నిహితంగా ఉండే రషీద్ అవసరమైనప్పుడు వారి సలహాలు తీసుకుంటుంటాడు.

ఇండియా ఎ కెప్టెన్‌గా...
2017లో అండర్-16 కేటగిరీలో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే హయ్యెస్ట్ రన్నర్‌గా రషీద్ నిలిచాడు. తర్వాతి ఏడాది అండర్-19లో 680 రన్స్‌తో జాతీయ స్థాయిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా తన సత్తా ఏంటో సెలెక్టర్లకు తెలియజేశాడు. ఐదేళ్లుగా ఆంధ్ర అండర్-14,16,19 జట్లకు నాయకత్వం వహిస్తున్న రషీద్.. ఈ ఏడాది నవంబరు 28 నుంచి డిసెంబరు 7 వరకు జరిగిన అండర్-19 బంగ్లాదేశ్, ఇండియా-ఎ, ఇండియా-బి ట్రై సిరీ్‌సలో 'ఎ' జట్టుకు సారథ్యం వహించాడు.

సెంచరీలంటే..
ఈ ఏడాది వినూ మన్కడ్‌లో ఆరు మ్యాచ్‌లాడిన రషీద్ రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలతో 400కు పైగా పరుగులు చేసి దుమ్మురేపాడు. చాలెంజర్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన ఈ మణికట్టు స్ట్రోక్ ప్లేయర్ ఒక అజేయ సెంచరీ సహా 275 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.'సచిన్, కోహ్లీ ఆట అంటే చాలా ఇష్టం. భారత యువ జట్టులో చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉంది.
మా నాన్న ప్రైవేటు ఉద్యోగి కావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి. నాన్న స్నేహితుడు ఇంద్రసేనారెడ్డి సాయం, మంగళగిరి అకాడమీలో కోచ్‌లు కృష్ణారావు, సీతాపతి, వినోద్, జ్ఞానేశ్వర్ శిక్షణ వల్ల ఈ స్థాయికి రాగలిగాను" అని రషీద్ తెలిపాడు.
ఈనెల 23 నుంచి జరిగే ఆసియాక్‌పలో ఆడేందుకు రషీద్ సోమవారం దుబాయ్ బయలుదేరి వెళ్లాడు. జనవరిలో ప్రారంభమవనున్న ఈ మెగా టోర్నీలో భారత బ్యాటింగ్ తురుపుముక్కగా భావిస్తున్న రషీద్ అంచనాలకు తగ్గట్టు రాణించి త్వరలోనే జాతీయ జట్టు తలుపు తట్టాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications












