ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లండ్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. గ్రూప్-సీలో భాగంగా వెస్టిండీస్‌తో వాంఖడే మైదానం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో సూపర్-8 అవకాశాలను ఇంగ్లండ్ సంక్లిష్టం చేసుకోగా.. వెస్టిండీస్ మెరుగుపర్చుకుంది. వెస్టిండీస్ స్పిన్నర్ గుడాకేష్ మోతీ(3/33) మూడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. జాసన్ హోల్డర్(17 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 33) మెరుపులు మెరిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, సామ్ కరణ్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది జాకోబ్ బెతెల్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33), ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), సామ్ కరణ్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. వెస్టిండీస్ బౌలర్లలో గుడాకేష్ మోతీ(3/33) మూడు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్(2/29) రెండు వికెట్లు పడగొట్టాడు. అకీల్ హొస్సేన్, రొమారియో షెఫెర్డ్, షమార్ జోసెఫ్ తలో వికెట్ తీసారు.
197 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఆడే క్రమంలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలోనే వెనుదిరిగాడు. జాకోబ్ బెతెల్ మెరుపులు మెరిపించడంతో పవర్ ప్లేలో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. కానీ ఆ వెంటనే జోస్ బట్లర్(21), టామ్ బాంటన్(2), జాకోబ్ బెతెల్, వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు.
వెస్టిండీస్ స్పిన్నర్ మోతీ బంతితో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్(17)ను కూడా ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. విల్ జాక్స్(2) విఫలమవ్వగా.. బౌండరీ లైన్‌పై రోవ్‌మెన్ పోవెల్ అద్భుతమైన క్యాచ్‌తో జెమీ ఓవర్టన్(5) వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్(6 )కూడా అనవసరం పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఓవైపు వికెట్లు పడినా... మరోవైపు సామ్ కరణ్ ఒంటరి పోరాటం చేశాడు. కానీ లియమ్ డాసన్(1) రనౌట్‌గా వెనుదిరిగ్గా.. ఆదిల్ రషీద్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో విండీస్ విజయం లాంఛనమైంది.