Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs SRH: మలుపు తిప్పిన ప్రసిధ్ కృష్ణ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రసిధ్ కృష్ణ(2/19) సంచలన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్పుకుంది. అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయలేదు. మరోవైపు ఏడో విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది.

గిల్, బట్లర్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76), జోస్ బట్లర్(37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. సాయి సుదర్శన్(23 బంతుల్లో 9 ఫోర్లతో 48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/35) మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ తలో వికెట్ తీసారు.

GT vs SRH IPL 2025 Prasidh Krishna helps Gujarat Titans Beat Sunrisers Hyderabad

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసి ఓటమిపాలైంది. అభిషేక్ శర్మ(41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్(2/33) రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, గెరాల్డ్ కోయిట్జీ తలో వికెట్ పడగొట్టారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంటే.. గుజరాత్ టైటాన్స్ మాత్రం స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో విజయాన్నందుకుంది.

చెలరేగిన అభిషేక్ శర్మ..
225 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ప్రారంభించింది. మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతినే అభిషేక్ శర్మ సిక్సర్‌గా మలిచాడు. తర్వాతి ఓవర్లలోనూ అభిషేక్ శర్మ సిక్స్‌లు కొట్టాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ సైతం బౌండరీలు బాదడంతో సన్‌రైజర్స్ వేగంగా పరుగులు చేసింది. కానీ ప్రసిధ్ కృష్ణ వేసిన ఐదో ఓవర్‌లో రషీద్ ఖాన్ స్టన్నింగ్ క్యాచ్‌తో ట్రావిస్ హెడ్ వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి ఇషాన్ కిషన్ రాగా.. సన్‌రైజర్స్ పరుగుల వేగం తగ్గింది. దాంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 57 పరుగులే చేసింది.

మలుపు తిప్పిన ప్రసిధ్ కృష్ణ..
పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన ఇషాన్ కిషన్(13)ను గెరాల్డ్ కోయిట్జీ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన క్లాసెన్ భారీ సిక్సర్ బాదడంతో 10.5 ఓవర్లలో సన్‌రైజర్స్ 100 పరుగుల మార్క్ అందుకుంది. కోయిట్జీ వేసిన 12వ ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టిన అభిషేక్ శర్మ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన అతను వేగంగా పరుగులు రాబట్టాడు. అయితే ప్రసిధ్ కృష్ణ కట్టడిగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఛేదించాల్సిన రన్ రేట్ పెరుగుతుండటంతో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన అభిషేక్ శర్మ.. ఇషాంత్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

ఆ మరుసటి ఓవర్‌లోనే క్లాసెన్‌ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయడంతో సన్‌రైజర్స్ ఓటమి ఖాయమైంది. సిరాజ్ వరుస బంతుల్లో అనికేత్ వర్మ(3), కామిందు మెండీస్(0)లను పెవిలియన్ చేర్చి గుజరాత్ విజయాన్ని సులువు చేశాడు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ సిక్స్‌లతో అలరించాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా..చివరి రెండు ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లతోనే ఆడింది. ఆఖరి ఓవర్‌లో రెండు బంతులేసిన తర్వాత ఇషాంత్ శర్మ గాయపడటంతో.. ఆ ఓవర్‌ను సాయి కిషోర్ పూర్తి చేశాడు. సాయి కిషోర్ కట్టడిగా వేయడంతో మెరుపులు లేకుండా సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది.

కొంపముంచిన షమీ..
అంతకుముందు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ల ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. అహ్మదాబాద్ వికెట్‌పై కీలకం అవుతాడని భావించిన మహమ్మద్ షమీ.. 3 ఓవర్లలో 48 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ తీయలేదు. షమీ వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. తొలి ఓవర్‌లో 11 పరుగులిచ్చిన షమీ.. మూడో ఓవర్‌లో 5 బౌండరీలతో 20 పరుగులు సమర్ఫించుకున్నాడు. 10వ ఓవర్‌లో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన షమీ 17 పరుగులిచ్చాడు. దాంతో అతన్ని ప్యాట్ కమిన్స్.. బయటకు పంపించాడు. అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ట్రావిస్ హెడ్‌ను ఫీల్డింగ్‌కు తీసుకొచ్చాడు. మరో ఓవర్ వేసే అవకాశం ఉన్నా.. షమీకి బంతినిచ్చే సాహసం కమిన్స్ చేయలేదు.

GT vs SRH IPL 2025 Prasidh Krishna helps Gujarat Titans Beat Sunrisers Hyderabad

చెలరేగిన గుజరాత్ త్రయం..
షమీ చెత్త బౌలింగ్‌తో చెలరేగిన గుజరాత్ ఓపెనర్లు పవర్ ప్లేలోనే 82 పరుగులు చేశారు. తొలి వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాయి సుదర్శన్‌ను జీషన్ అన్సారీ ఔట్ చేసినా.. బట్లర్ సాయంతో శుభ్‌మన్ గిల్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను ప్యాట్ కమిన్స్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు. వివాదాస్పద రీతిలో శుభ్‌మన్ గిల్ రనౌటవ్వగా.. సుందర్‌తో కలిసి బట్లర్ దూకుడుగా ఆడాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వేగంగా పరుగులు చేసే క్రమంలో బట్లర్, వాషింగ్టన్ సుందర్(21), రాహుల్ తెవాటియా(6), రషీద్ ఖాన్(0) ఔటయ్యారు. దాంతో గుజరాత్ టైటాన్స్ 10 పరుగులు తక్కువగానే చేసింది.

ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్..
ఈ పరాజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. చివరి నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచినా ఆరెంజ్ ఆర్మీ టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ నాలుగు నాలుగు గెలిస్తే సన్‌రైజర్స్ ఖాతాలో 14 పాయింట్స్ చేరుతాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్‌పై ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. సన్‌రైజర్స్ నెట్ రన్‌రేట్ కూడా తక్కువగానే ఉంది. అద్భుతం జరిగితే తప్పా ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ చేరలేదు. మరో మ్యాచ్ ఓడితే మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది.

Story first published: Friday, May 2, 2025, 23:35 [IST]
Other articles published on May 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+