అహ్మదాబాద్: గత రెండు మ్యాచ్‌ల్లో పెట్టిన గుడ్లతో(డకౌట్స్) చాలినన్నీ ఆమ్లెట్లు వేసుకున్నానని, ఇక పరుగులే చేయాల్సి ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చమత్కరించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సంజూ శాంసన్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా తన బ్యాటింగ్‌పై స్పందించిన సంజూ శాంసన్.. ఈ మ్యాచ్‌లో పరుగులు చేయాల్సిన అవసరం తనకు ఉందని చెప్పాడు.
గత రెండు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్ వరుసగా డకౌటైన విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ల్లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఈ విషయాన్ని హోస్ట్ సంజూ ముందు ప్రస్తావించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'రెండు గుడ్లతో(డకౌట్స్) సరిపోయేన్ని ఆమ్లేట్లు వేసుకున్నా. పరుగులు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.'అని నవ్వుతూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ట్రెంట్ బౌల్ట్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వగా.. దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతాడని సంజూ శాంసన్ తెలిపాడు. ఇంకా ఈ రూల్ గురించి తనకు తెలియదని, నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ వృద్దిమాన్ సాహా(4) తొలి ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. సాహా ఇచ్చిన హై క్యాచ్ కోసం ముగ్గురు ప్లేయర్లు పోటీపడగా.. చివరకు సంజూ శాంసన్ గ్లోవ్స్ తాకి చేజారిన బంతిని బౌల్ట్ చాకచక్యంగా అందుకున్నాడు.
ఆ తర్వాత వచ్చిన సాయిసుదర్శన్(20).. బట్లర్ సూపర్ త్రోకు రనౌటవ్వగా.. హార్దిక్ పాండ్యాతో కలిసి శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడాడు. దాంతో గుజరాత్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 42 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం శుభ్‌మన్ గిల్, హార్దిక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేయగా.. చాహల్ దెబ్బతీసాడు.
జోరు మీదున్న హార్దిక్ పాండ్యా(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్‌తో శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు.