For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

GT vs RR: కొంపముంచిన సంజూ.. రాజస్థాన్ రాయల్స్‌కు ఘోర పరాజయం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయాన్ని ఆ జట్టు ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రసిధ్ కృష్ణ(3/24) తీన్మార్ బౌలింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు చేసింది.

సాయి సుదర్శన్(53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. జోస్ బట్లర్(25 బంతుల్లో 5 ఫోర్లతో 36), షారూఖ్ ఖాన్(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36), రాహుల్ తెవాటియా(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే(2/53), మహీష్ తీక్షణ(2/54)రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్(1/30), సందీప్ శర్మ(1/41) చెరో వికెట్ పడగొట్టారు.

GT vs RR IPL 2025 What was The Turning Point as Gujarat Titans beat Rajasthan Royals

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. సంజూ శాంసన్(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), షిమ్రాన్ హెట్‌మైర్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/24) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా తలో వికెట్ తీసారు. రషీద్ ఖాన్(2/37), సాయి కిషోర్(2/20)లకు రెండేసి వికెట్లు దక్కాయి. సంజూ శాంసన్ వికెట్ ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కూడా రాజస్థాన్ రాయల్స్‌కు నష్టం చేసింది.

నిరాశపర్చిన యశస్వి, రాణా..

భారీ లక్ష్యచేధనలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్(6), నితీష్ రాణా(1) పెవిలియన్ చేరారు. యశస్విని అర్షద్.. రాణాను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. రియాన్ పరాగ్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించిన సంజూ శాంసన్.. తనదైన షాట్లతో చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్లకు 57 పరుగులు చేసింది. మూడు సిక్స్‌లతో దూకుడుగా ఆడిన రియాన్ పరాగ్‌(26)ను కుల్వంత్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే ధ్రువ్ జురెల్(5)ను రషీద్ ఖాన్ ఔట్ చేయడంతో 68 పరుగులకే రాజస్థాన్ 5 వికెట్లు కోల్పోయింది.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
ఈ పరిస్థితుల్లో షిమ్రాన్ హెట్‌మైర్‌తో కలిసి సంజూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 48 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని ప్రసిధ్ కృష్ణ విడదీసాడు. సంజూను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభమ్ దూబే(1), జోఫ్రా ఆర్చర్(4) తీవ్రంగా నిరాశపరిచారు. ఓవైపు వికెట్లు పడినా మరోవైపు హెట్‌మైర్ చెలరేగాడు. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ప్రసిధ్ అన్‌సంగ్ హీరో..
అయితే అతన్ని కూడా ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చడంతో రాజస్థాన్ ఓటమి ఖాయమైంది. మహీష్ తీక్షణ(5), తుషార్ దేశ్‌పాండే(3) తీవ్రంగా నిరాశపరిచారు. సందీప్ శర్మ(6 నాటౌట్) అజేయంగా నిలిచాడు. సంజూ శాంసన్‌తో పాటు హెట్‌మైర్, జోఫ్రా ఆర్చర్‌లను ఔట్ చేసి ప్రసిధ్ కృష్ణ రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ అన్‌సంగ్ హీరోగా నిలిచాడు.

సాయి సంచలన బ్యాటింగ్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ స్టన్నింగ్ డెలివరీకి శుభ్‌మన్ గిల్(2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జోస్ బట్లర్‌తో కలిసి సాయి సుదర్శన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. దాంతో పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. తీక్షణ బౌలింగ్‌లో సింగిల్ తీసి సాయి సుదర్శన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

తేవాటియా మెరుపులు..
అదే ఓవర్‌ ఆఖరి బంతికి జోస్ బట్లర్ ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన షారూఖ్ ఖాన్‌ దూకుడుగా ఆడాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతన్ని తీక్షణ ఔట్ చేయగా.. షెఫ్రెన్ రూథర్‌ఫోర్డ్(7)ను సందీప్ శర్మ పెవిలియన్ చేర్చాడు. సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్‌ను తుషార్ దేశ్‌పాండే కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. రషీద్ ఖాన్(12) సాయంతో రాహుల్ తేవాటియా.. జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు.

టేబుల్ టాపర్‌గా గుజరాత్

ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఏడో స్థానాన్ని పడిపోయింది. ఐదు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ 2 విజయాలు మాత్రమే నమోదు చేసింది. టాప్-4లో గుజరాత్ టైటాన్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కొనసాగుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ 10వ స్థానంలో నిలిచింది.

Story first published: Wednesday, April 9, 2025, 23:39 [IST]
Other articles published on Apr 9, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+