
అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(3/17) సత్తా చాటడంతో రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థి ముందు 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అనాలోచిత నిర్ణయంతో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్(35 బంతుల్లో 5 ఫోర్లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. షమీ, యశ్ దయాల్, రషీద్ తలో వికెట్ తీసారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం దక్కలేదు. క్రీజులో సెట్ అయినట్లు కనిపించిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(22) భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి సంజూ శాంసన్ రాగా.. పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. ఆ తర్వాత బట్లర్ బౌండరీలతో జోరు కనబర్చగా.. సంజూ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన షార్ట్ బాల్‌కు సంజూ వెనుదిరిగాడు. బట్లర్ బౌండరీలు బాదగా.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో దేవదత్ పడిక్కల్(2) క్యాచ్ ఔటయ్యాడు.
ఆ మరుసటి ఓవర్‌లోనే హాఫ్ సెంచరీ దిశగా సాగిన బట్లర్ కూడా వెనుదిరిగాడు. హార్దిక్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో 79 పరుగులకే రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత హెట్‌మైర్ రెండు బౌండరీలతో జోరు కనబర్చగా అతనికి హార్దిక్ పాండ్యా కళ్లెం వేసాడు. దాంతో ఆర్‌ఆర్ బ్యాటింగ్ పతనం మొదలైంది. ధాటిగా ఆడే క్రమంలో అశ్విన్(6) కూడా ఔటవ్వడంతో రాజస్థాన్ 98 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్(7) ఔట్ కూడా ఔటవ్వగా.. మెక్ కాయ్, రియాన్ పరాగ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. గుజరాత్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. దాంతో రాజస్థాన్ 130 పరుగులకే పరిమితమైంది.