
గుజరాత్ సూపర్ బ్యాటింగ్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మిల్లర్‌కు తోడుగా హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 5 ఫోర్లతో 40 నాటౌట్), శుభ్‌మన్ గిల్(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35), మాథ్యూ వేడ్(30 బంతుల్లో 6 ఫోర్లతో 35) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఒబేడ్ మెక్‌కాయ్ తలో వికెట్ తీసారు. 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు తొలి ఓవర్‌లోనే గట్టిషాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే గుజరాత్ ఓపెనర్ ట్రెంట్ బౌల్ట్(0) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

ఆదుకున్న వేడ్, గిల్..
క్రీజులోకి వచ్చిన మాథ్యూ వేడ్‌తో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదారు. ఇక అశ్విన్ వేసిన 6వ ఓవర్‌లో గిల్.. 6, 4, 4 హ్యాట్రిక్ బౌండరీలు బాదడంతో గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. అయితే అశ్విన్ వేసిన 8వ ఓవర్‌లో సమన్వయలోపం కారణంగా గిల్ రనౌటయ్యాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ఒబేడ్ మెక్ కాయ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే క్రమంలో మాథ్యూ వేడ్ క్యాచ్ ఔటయ్యాడు.

మిల్లర్.. కిల్లర్!
క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా ఆచి తూచి ఆడారు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. 18 బంతుల్లో గుజరాత్ విజయానికి 34 పరుగులు అవసరమవ్వగా.. 18వ ఓవర్ వేసిన చాహల్ నాలుగు బంతులు సరిగ్గా వేసి ఐదో బంతికి సిక్స్ ఇచ్చి మొత్తం 11 పరుగులు సమర్పించుకున్నాడు. మెక్‌కాయ్ వేసిన 19వ ఓవర్‌లో బౌండరీ బాది క్విక్ సింగిల్‌తో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే రావడంతో ఆఖరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. ప్రసిధ్ వేసిన చివరి ఓవర్‌లో మిల్లర్ వరుసగా మూడు సిక్స్‌లు బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.


Click it and Unblock the Notifications












