
ముంబై: పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ కగిసో రబడా(4/33) నాలుగు వికెట్లతో చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ 144 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆరంభం నుంచే పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. యువ ప్లేయర్ సాయి సుదర్శన్(50 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకోవడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. గుజరాత్‌లో సాయి సుదర్శన్‌కు తోడుగా ఎవరూ రాణించలేదు. రిషి ధావన్ సూపర్ ఫీల్డింగ్‌తో రనౌట్ చేయడం గేమ్ చేంజర్‌గా మారింది. పంజాబ్ బౌలర్లలో రబడాకు తోడుగా.. రిషి ధావన్, అర్షదీప్ సింగ్, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం తగ్గలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే రిషి ధావన్ బుల్లెట్ త్రోకు శుభ్‌మన్ గిల్(9) రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం ధాటిగా ఆడే క్రమంలో వృద్దిమాన్ సాహా(21) రబడా బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(1)ను రిషి ధావన్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మిల్లర్‌తో సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
వీలు చిక్కిన బంతిని సాయి సుదర్శన్ బౌండరీలకు తరలించాడు. అయితే మిల్లర్‌ను ఔట్ చేసి లివింగ్ స్టోన్ గుజరాత్‌ను దెబ్బతీసాడు. రబడా వేసిన 17వ ఓవర్‌లో వరుస బంతుల్లో రాహుల్ తెవాటియా(11), రషీద్ ఖాన్(0) వెనుదిరగడంతో గుజరాత్ కోలుకోలేకపోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు నిలకడగా ఆడిన సాయి సుదర్శన్.. అర్షదీప్ వేసిన 18వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాది 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది సాయి సుదర్శన్‌కు తొలి హాఫ్ సెంచరీ. 19వ ఓవర్‌లో ఫెర్గూసన్ కూడా ఔటవ్వగా.. చివరి ఓవర్‌లో సుదర్శన్ బౌండరీతో 11 పరుగులు పిండుకున్నాడు.