ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్(42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 నాటౌట్), శశాంక్ సింగ్(16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్‌కు 232 పరుగుల భారీ స్కోర్ అందిస్తే.. బౌలింగ్‌లో విజయ్ కుమార్ వైశాఖ్ సంచలన ప్రదర్శనతో గుజరాత్ పతనాన్ని శాసించాడు.
15వ ఓవర్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అతను.. కట్టుదిట్టమైన వైడ్ యార్కర్లతో తన వరుస ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇచ్చి విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్ విజయంలో విజయ్ కుమార్ వైశాఖ్, శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్ పాత్ర కీలకం. కానీ వీటన్నిటి కంటే పంజాబ్ కింగ్స్ విజయం వెనుక శ్రేయస్ అయ్యర్ త్యాగం ఉంది.

97 పరుగుల వద్ద క్రీజులో ఉన్న అతను సెంచరీ కోసం ప్రయత్నించకుండా.. జట్టు భారీ స్కోర్ కోసమే ప్రయత్నించాడు. హిట్టింగ్ సామర్థ్యం కలిగిన శశాంక్ సింగ్‌కు తన సెంచరీ గురించి ఆలోచించకుండా భారీ షాట్లు ఆడాలని సూచించాడు.
అయ్యర్ సూచనలను పాటించిన అతను మహమ్మద్ సిరాజ్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఐదు బౌండరీలు బాది 23 పరుగులు పిండుకున్నాడు. ఈ పరుగులే పంజాబ్ కింగ్స్ విజయానికి కారణమయ్యాయి. అయ్యర్ జట్టు కోసం కాకుండా స్వార్థపూరితంగా ఆలోచించి ఉంటే.. ఆఖరి ఓవర్‌లో అన్ని పరుగులు వచ్చేవి కావు. అప్పుడు మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. శశాంక్ సింగ్ చేసిన పరుగులే తమ విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పాడు.
అయ్యర్ త్యాగంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్లు అతన్ని కొనియాడుతున్నారు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అయితే శ్రేయస్ అయ్యర్‌ను ఆకాశానికెత్తాడు. అతనో అద్భుతమైన సారథని కొనియాడాడు. సాధారణంగా ముంబై క్రికెటర్లు వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతారని, కానీ అయ్యర్ మాత్రం జట్టుకు తొలి ప్రాధాన్యత ఇచ్చాడని తెలిపాడు. తాను చూసిన ముంబై క్రికెటర్లలో చాలా మంది వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడేవారని గుర్తు చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఎంత గొప్ప కెప్టెనో అర్థమవుతుందని కితాబిచ్చాడు.