GT vs MI: మలుపు తిప్పిన హార్దిక్ పాండ్యా రనౌట్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన గుజరాత్!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్నందుకుంది. శుక్రవారం టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై.. 5 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో 9 పరుగులను కాపాడుకొని థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఇక సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను గుజరాత్ అనవసర తప్పిదాలతో చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(28 బంతుల్లో5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ఇషాన్ కిషన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45), టీమ్ డేవిడ్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. వృద్దిమాన్ సాహా(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), శుభ్‌మన్ గిల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. పొలార్డ్ ఓ వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రనౌట్ మ్యాచ్‌ను ములపుతిప్పింది.

చెలరేగిన ఓపెనర్లు..
178 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా శుభారంభం అందించారు. ఈ ఇద్దరూ బౌండరీలు బాదడంలో పోటాపోటీ ఆడారు. రెండో ఓవర్‌లోనే ఓ సిక్సర్, రెండు బౌండరీలు బాదిన సాహా.. మెరిడిత్ వేసిన 4వ ఓవర్‌లో మరో రెండు బౌండరీలు బాదాడు. గిల్ సైతం ఓ భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ కొట్టడంతో గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. పవర్ ప్లేలో అనంతరం డానియల్ సామ్స్ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాదిన గిల్.. ఆ మరుసటి ఓవర్‌లో మరో సిక్సర్‌తో పాటు బౌండరీ బాదాడు. దాంతో గుజరాత్ 11 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. ముందుగా సాహా హాఫ్ సెంచరీ చేసుకోగా.. ఆ తర్వాత గిల్ కూడా అర్థ శతకం సాధించాడు.

మలుపు తిప్పిన పాండ్యా రనౌట్..
క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మురుగన్ అశ్విన్ విడదీసాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి దెబ్బతీసాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా, సాయి సుదర్శన్ దూకుడుగా ఆడారు. అయితే సాయి సుదర్శన్ విచిత్రకర రీతిలో హిట్ వికెట్ అయ్యాడు. విజయానికి చేరువలో హార్దిక్ పాండ్యా అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఇది మ్యాచ్‌ను మలుపు తిప్పింది. బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో మిల్లర్ సిక్సర్ బాదడంతో గుజరాత్ విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమయ్యాయి.

డానియల్ సామ్స్ సూపర్ బౌలింగ్..
డానియల్ సామ్స్ అద్భుతమైన బౌలింగ్‌తో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి గుజరాత్ ఓటమిని శాసించాడు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీయగా.. రెండో బంతికి డబుల్ తీసే ప్రయత్నంలో తెవాటియా రనౌటయ్యాడు. దాంతో ఒత్తిడికి గురైన గుజరాత్.. చివరకు ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications