అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలోనే రెండు ఓవర్లు వేసిన అర్జున్.. ఓ వికెట్ తీయడంతో పాటు 9 పరుగులే ఇచ్చాడు. ఒక్క బౌండరీ కూడా ఇవ్వని అర్జున్.. ఏడు డాట్ బాల్స్ వేసాడు. డేంజరస్ వృద్దిమాన్ సాహాను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
ఇంత అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. మిడిల్ ఓవర్లతో పాటు డెత్ ఓవర్లలోనూ అతనికి బంతిని అందించలేదు. ధారళంగా పరుగులిస్తున్న కామెరూన్ గ్రీన్, బెహ్రాన్ డార్ఫ్, రిలే మెరిడిత్‌లపైనే నమ్మకం ఉంచాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో అర్జున్ టెండూల్కర్ ధారుణంగా విఫలమయ్యాడు. ఒకే ఓవర్‌లో 31 పరుగులు సమర్పించుకొని మ్యాచ్ మూమెంటమ్‌ను మార్చి ముంబై ఓటమికి కారణమయ్యాడు.

ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ భయంతోనే అర్జున్ టెండూల్కర్‌కు రోహిత్ శర్మ మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. కానీ రోహిత్ ఏదైతో జరగవద్దనుకున్నాడో అదే జరిగింది. మరోసారి డెత్ ఓవర్లలో ముంబై బౌలర్లు చేతులెత్తేసారు. ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.
తొలి 13 ఓవర్లలో 4 వికెట్లకు 103 పరుగులు చేసిన గుజరాత్.. చివరి 7 ఓవర్లలో 2 వికెట్లకు 104 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తేవాటియా విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగడంతో ముంబై బౌలర్లు తేలిపోయారు. ఈ క్రమంలోనే అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ ఇచ్చినా కట్టడి చేసేవాడని, అతనికి బౌలింగ్ ఇవ్వకుండా రోహిత్ తప్పు చేశాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవిడ్ మిల్లర్(22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46), అభినవ్ మనోహర్(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), రాహుల్ తేవాడియా(5 బంతుల్లో 3 సిక్సర్లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, జాసన్ బెహ్రాండార్ఫ్, రిలే మెరిడిత్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.