GT vs KKR:రస్సెల్ చెలరేగినా కేకేఆర్‌కు తప్పని పరాజయం!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ సమష్టిగా రాణించిన గుజరాత్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. సూపర్ బౌలింగ్‌తో స్వల్ప స్కోర్‌ను కాపాడుకుంది. ఇక 6వ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67) హాఫ్ సెంచరీతో రాణించాడు.

రస్సెల్ చెలరేగినా..
కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ నాలుగు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 రన్స్ చేసింది. ఆండ్రీ రస్సెల్(25 బంతుల్లో 6 సిక్సర్లు, ఫోర్‌తో 48), రింకూ సింగ్(35) మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, యశ్ దయాల్, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్ చెరొక వికెట్ పడగొట్టారు.

ఆరంభంలోనే..
157 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మహమ్మద్ షమీ వేసిన వరుస ఓవర్లలో కేకేఆర్ ఓపెనర్లు సామ్ బిల్లింగ్స్(4), సునీల్ నరైన్(5) ఔటవ్వగా.. నితీశ్ రాణా(2)ను ఫెర్గూసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో కేకేఆర్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 34 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే యశ్ దయాల్ వేసిన తొలి బంతికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(12) కూడా ఔటయ్యాడు. దాంతో కేకేఆర్ 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

చివరి ఓవర్‌లో..
ఈ పరిస్థితుల్లో రింకూ సింగ్(35) జట్టును ఆదుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్ (17)తో కలిసి 5వ వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. రింకూ సింగ్‌ను యశ్ దయాల్ ఔట్ చేయగా.. వెంకటేశ్ అయ్యర్(17)ను రషీద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్ చెలరేగాడు. మరో ఎండ్‌లో శివం మావి(2) ఔటైనా.. ఉమేశ్ యాదవ్(15 నాటౌట్) సాయంతో జట్టును విజయం దిశగా నడిపించాడు. 6 సిక్స్‌లతో హాఫ్ సెంచరీకి చేరువైన ఆండ్రీ రస్సెల్ ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో కేకేఆర్ ఓటమి ఖాయమవ్వగా.. గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్నందుకొని పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications