అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్ వెటరన్ పేసర్ మోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన మోహిత్ శర్మ.. ఆఖరి ఓవర్‌లో రిపల్ పటేల్ వికెట్ తీయడం ద్వారా 100 వికెట్ల మార్క్‌ను పూర్తి చేశాడు.
దాదాపు మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ.. 34 ఏళ్ల వయసులో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 92 మ్యాచ్‌లు ఆడిన మోహిత్ శర్మ.. భారత తరఫున 100 వికెట్ల ఘనతను అందుకున్న పదో పేసర్‌గా గుర్తింపు పొందాడు.

100 ఐపీఎల్ వికెట్లు అందుకున్న భారత పేసర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్(161), జస్‌ప్రీత్ బుమ్రా(145), ఉమేశ్ యాదవ్(136), సందీప్ శర్మ(122), మమమ్మద్ షమీ(116), హర్షల్ పటేల్(108), ఆశిష్ నెహ్రా(106), వినయ్ కుమార్(105), జహీర్ ఖాన్(102), మోహిత్ శర్మ(100) కన్నా ముందున్నారు.
ఇక గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా కూడా అరుదైన ఘనతను అందుకున్నాడు. వికెట్ కీపర్‌గా 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు పట్టడం ద్వారా సాహా ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లలో పాలుపంచుకున్న వికెటర్ల జాబితాలో సాహా మూడో స్థానంలో ఉన్నాడు.
178 వికెట్లతో ధోనీ అగ్రస్థానంలో ఉండగా.. దినేశ్ కార్తీక్ 169 వికెట్లలో పాలుపంచుకొని రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సాహా 100 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును ఆమన్ ఖాన్ (44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి తోడుగా అక్షర్ పటేల్(27), రిపల్ పటేల్(23) రాణించారు. గుజరాత్ బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ రెండు, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.