ఐపీఎల్ 2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 48 గంటల వ్యవధిలో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు టైటిలే లక్ష్యంగా ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ప్రత్యర్థి జట్ల బలహీనతలకు తగ్గట్లు వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. రెండు నెలల పాటు సాగే ఈ టోర్నీలో విజేతగా నిలిచే జట్టు ఏదో అంచనా వేయడం కష్టమే. ఐపీఎల్‌లో ఫలితాలు అంచనాలకు మించి ఉంటాయి. ఏ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పడం కష్టం.
ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచే జట్టు ఏదని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఛాట్ బోట్ గ్రోక్‌ను సంప్రదించగా.. ఆసక్తికర సమాధానం చెప్పింది. ఎక్స్ ఏఐ చాట్‌బోట్ అయిన గ్రోక్ సమాధానాలు కచ్చితంగా ఉండటం.. తెలంగాణతో పాటు స్థానిక భాషల స్లాంగ్‌లో సమధానాలు ఇస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మిగతా ఏఐ చాట్‌బాట్‌ల కంటే గ్రోక్ సమాధానాలు బాగున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నావని గ్రోక్‌ను గోకితే ఆసక్తికర సమాధానం చెప్పింది.

ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. 'ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే విన్నర్ ఎవరో చెప్పడం కాస్త కష్టమే. ఆటగాళ్ల గాయాలు, ఫామ్ కూడా జట్ల విజయవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రస్తుత జట్ల బలాలు.. గత చరిత్రను పరిశీలిస్తే కొన్ని జట్లకు మాత్రమే టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అందులో ముంబై ఇండియన్స్ ముందు వరుసలో ఉంది.
ఆ జట్టు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రాలతో పాటు ఇతర ఆటగాళ్లతో చాలా సమతూకంగా ఉంది. ఇప్పటికే వారు ఐదు టైటిళ్లు గెలిచారు. వారి బ్యాటింగ్ డెప్త్ కూడా బాగుంది. ముంబై ఇండియన్స్‌తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌లకు టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక్క జట్టు పేరు మాత్రమే చెప్పమంటే నేను ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుస్తుందని చెబుతాను.'అని గ్రోక్ సమాధానం ఇచ్చింది.