ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎదురైన పరాజయం తమ మంచికేనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తాత్కలిక సారథి జితేష్ శర్మ అన్నాడు. ఈ ఓటమితో తమ తప్పిదాలు తెలిసొచ్చాయని, తదుపరి మ్యాచ్‌లకు మరింత పకడ్బందీగా సిద్దమవుతామని చెప్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆర్‌సీబీ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఆర్‌సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జితేష్ శర్మ.. పేలవ బౌలింగ్, చెత్త షాట్లు తమ విజయవకాశాలు దెబ్బతీసాయని చెప్పాడు. గెలిచే పరిస్థితుల నుంచి ఎలా ఓడిపోయామో అర్థం కావడం లేదన్నాడు. 'మేం బౌలింగ్‌లో 20-30 పరుగులు అదనంగా ఇచ్చాం. అయినా బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శనే చేశాం. గెలిచే పరిస్థితుల నుంచి ఎలా ఓడిపోయామో నాకు అర్థం కావడం లేదు. బ్యాటింగ్‌లో మేం కాస్త నిర్లక్ష్యంగా ఆడాం. మాలో ఇంటెన్సిటీ లోపించింది. కీలక సమయంలో నేను ఔటవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసింది. టీమ్ డేవిడ్ గాయపడటంతో నేను దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాను.

అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడం మంచిదే అయ్యింది. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మరింత రాటు దేలుతాం. రాబోయే మ్యాచ్‌లకు పకడ్బందీగా బరిలోకి దిగుతాం. ఈ మ్యాచ్‌లో ఓడినా మేం బాగానే బ్యాటింగ్ చేశాం. ఈ మ్యాచ్‌లో మాకు అదే సానుకూలాంశం.'అని జితేష్ శర్మ చెప్పుకొచ్చాడు.
తాజా పరాజయంతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి పడిపోయింది. 42 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలవ్వడంతో రన్‌రేట్ బాగా తగ్గింది. దాంతో 17 పాయింట్లు ఉన్నా మూడో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆర్‌సీబీ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 17 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించినా.. టాప్-2లో నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.