న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టు వివరాలను శుక్రవారం వెల్లడించింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన జట్టునే కొనసాగించింది. యువ పేసర్ యశ్ దయాల్ గాయపడటంతో అతన్ని మాత్రమే తప్పించింది. మిగతా జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు.
అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి కలిసి రానుంది. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు యశ్ దయాల్ దూరం కావడంతో.. అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఐపీఎల్ 2025 రిటెన్షన్ ప్రకారం అనామక ఆటగాళ్లను రూ. 4 కోట్లకే రిటైన్ చేసుకోవచ్చు.

ఐపీఎల్ 2024 మెగా వేలంలో రూ. 5 కోట్ల భారీ ధరకు యశ్ దయాల్‌ను ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. ఇప్పుడు అతన్ని రూ. 4 కోట్లకే రిటైన్ చేసుకునే అవకాశం ఆర్‌సీబీకి లభించింది. అయితే న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు యశ్ దయాల్ ఎంపికై.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తే అతను క్యాప్డ్ ప్లేయర్ అయ్యేవాడు. అప్పుడు అతన్ని రిటైన్ చేసుకోవాలనుకుంటే కనిష్టంగా రూ. 11 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. కానీ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో ఆ జట్టుకు బిగ్ రిలీఫ్ లభించింది.
ఇప్పటికే ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది. నేరుగానైనా.. ఆర్‌టీఎమ్ ద్వారానైనా ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. జట్ల పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచింది. గరిష్టంగా ఐదుగురు క్యాప్‌డ్, ఇద్దరు అనామక ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని పేర్కొంది.
రిటైన్ చేసుకునే ముగ్గురి ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించాలి. నాలుగో, ఐదో ఆటగాడిని రిటైన్ చేసుకోవాలనుకుంటే రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు చెల్లించాలి. అనామక ఆటగాళ్లకు రూ. 4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాను ప్రకటించాలని ఫ్రాంచైజీలను ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా వేలం జరగనుంది. ఈ సారి విదేశాల్లో మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.