టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా మానవమాత్రుడేనని, ఏదో ఒక రోజు విఫలం కావచ్చని, అది ఫైనల్ కావాలని తాము కోరుకుంటున్నామని న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ అన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడాలనే కసితో న్యూజిలాండ్ ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలవాలనే లక్ష్యంతో ఉన్న కివీస్ మైండ్ గేమ్ మొదలు పెట్టింది. ఈ ఫైనల్ గేమ్ కోసం అన్ని విధాల సిద్దమయ్యామని చెప్పిన గ్లేన్ ఫిలిప్స్.. తమ వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

'జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలర్ అనడంలో సందేహం లేదు. అతని బౌలింగ్‌లో ఎంతో వైవిధ్యం ఉంది. యార్కర్లను గొప్పగా సంధించగలడు. అయితే అతను కూడా మానవమాత్రుడే. ఏదో ఒక రోజు విఫలం కావచ్చు. అది ఆదివారమే కావాలని కోరుకుంటున్నా.
భారత్‌లో ప్రతిభ కలిగిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఈ ప్రపంచ కప్‌లో సమానంగా పోటీ పడగల మూడు వేర్వేరు జట్లను వారు ఎంపిక చేయగలరు. అంతటి అపారమైన టాలెంట్ వారి సొంతం. కాబట్టి, మా లాంటి తక్కువ జనాభా కలిగిన దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జట్లతో పోటీ పడటం నిజంగా గొప్ప విషయం.
భారత్‌తో పోలిస్తే జనాభా పరంగా తమది చాలా చిన్నదేశం. అయినా క్రికెట్‌లో తమ దేశం సాధిస్తూ వచ్చిన ఘనతలు చిన్నవి కాదు. సుమారు 50 లక్షల జనాభా కలిగిన న్యూజిలాండ్.. ప్రపంచకప్ లాంటి వేదికపై భారత్‌తో ఫైనల్లో తలపడే అవకాశం రావడం కూడా గొప్ప విషయం.
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో విఫలమైన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఏ మాత్రం తక్కువ అంచనా వేయం. మేం ఇప్పటికే అతన్ని చాలాసార్లు ఎదుర్కొన్నాం. అది మాకు సహాయపడుతుంది. మేం కేవలం ఒక బంతిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఆడతాం. అతనికి మంచి రోజు ఉండవచ్చు. అలాగే మాకు కూడా మంచి రోజు ఉండే అవకాశం ఉంటుంది.' అని ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు.