బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనను పోల్చారని, అదే తన కెరీర్‌లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న మ్యాక్సీ.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదాడు.
ఫ్రాంచైజీ మీడియాతో మాట్లాడిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. కెరీర్‌లో ఇప్పటి వరకు అందుకున్న అత్యుత్తమ ప్రశంస ఏంటని హోస్ట్ ప్రశ్నించగా.. విరాట్ కోహ్లీతో పోల్చడేమనని మ్యాక్సీ బదులిచ్చాడు.

'ఓ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన నన్ను విరాట్ కోహ్లీతో పోల్చారు. ఇదే నా కెరీర్‌లో నాకు దక్కిన అత్యుత్తమ ప్రశంస. ఇలా పోల్చడం ఏ మాత్రం అవసరం లేదు. కోహ్లీతో పోల్చడం కూడా సరికాదేమో. కానీ ఒకటి రెండు ఇన్నింగ్స్‌ల్లో నేను అత్యుత్తమంగా రాణించడంతో విరాట్ కోహ్లీతో పోల్చారు. ఇదే నాకు దక్కిన గొప్ప ప్రశంస'అని మ్యాక్స్‌వెల్ చెప్పుకొచ్చాడు.
భారత్‌లో ఫేవరేట్ ఫ్యాన్ ఇంటరాక్షన్ గురించి చెప్పమని అడగ్గా.. చాలా ఉన్నాయని మ్యాక్స్‌వెల్ బదులిచ్చాడు. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన ఓ ఘటన తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, తాను ప్రయాణిస్తున్నప్పుడు అభిమానులు వెంబడించారని, కిటికీలపై గుద్దారని తెలిపాడు.
'భారత్‌లో అడుగుపెట్టిన ప్రతీసారి ఎయిర్‌పోర్ట్ నుంచే అభిమానులు ఘన స్వాగతం పలుకుతారు. నిన్న అయితే కారులో వెళ్తున్న నన్ను, ఫాఫ్ డుప్లెసిస్‌ను వెంబడించారు. విండోస్ తెరవాలని కోరారు. ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది.'అని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు. కాలి సర్జరీ తర్వాత తాను ఏడు కిలోలు తగ్గానని తెలిపాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆర్‌సీబీ.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 212 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. తదుపరి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం ఆడనుంది.