టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ చిరునవ్వులు చిందించాడు. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే గంభీర్.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ మూడో రోజు ఆటలో నవ్వుతూ కనిపించాడు. నైట్ వాచ్‌మన్‌గా బ్యాటింగ్‌కు దిగిన ఆకాష్ దీప్ అనూహ్యంగా హాఫ్ సెంచరీ సాధించడంతో గంభీర్ సంతోషానికి గురయ్యాడు. ఆకాష్ దీప్‌ను అభినందిస్తూ చిరునవ్వులు చిందించాడు. ప్రస్తుతం గంభీర్ నవ్వుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. 'నవ్విండయ్యా.. గంభీర్'అని కామెంట్ చేస్తున్నారు. గంభీర్ నవ్వడం.. ప్రపంచంలో 8వ వింత అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
23 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ వెనువెంటనే కేఎల్ రాహుల్(7), సాయి సుదర్శన్(11)ల వికెట్లను కోల్పోయింది. దాంతో వికెట్లను కాపాడుకునేందుకు ఆకాష్ దీప్‌ను నైట్‌వాచ్‌మన్‌గా టీమిండియా మేనేజ్‌మెంట్ పంపించింది. జైస్వాల్‌తో ఆచితూచి ఆడిన ఆకాష్ దీప్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. మూడో రోజు ఆటలో అసాధారణ ప్రదర్శనతో ఔరా అనిపించాడు. జైస్వాల్‌తో సమయోచితంగా బ్యాటింగ్ చేసిన ఆకాష్ దీప్.. టాపార్డర్ బ్యాటర్‌గా పరుగులు రాబట్టాడు. వీలు చిక్కిన బంతులను బౌండరీలకు తరలించాడు.

ఈ క్రమంలో 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో ఆకాష్ దీప్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ. 20 బంతులు ఆడితేనే ఎక్కువ అనుకున్న ఆకాష్ దీప్.. 94 బంతులు ఎదుర్కొని యశస్వి జైస్వాల్‌తో కలిసి మూడో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
జెమీ ఓవర్టన్ బౌలింగ్‌లో ఆకాష్ దీప్(94 బంతుల్లో 12 ఫోర్లతో 66) క్యాచ్ ఔటైనా.. యశస్వి జైస్వాల్(164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 118) సెంచరీతో చెలరేగాడు. శుభ్‌మన్ గిల్(11), కరుణ్ నాయర్(17) నిరాశపర్చినా.. రవీంద్ర జడేజా(27 బ్యాటింగ్), ధ్రువ్ జురెల్(27 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు. ఇప్పటికే భారత్ ఆధిక్యం 284 పరుగులకు చేరుకుంది. 350 ప్లస్ లక్ష్యాన్ని నమోదు చేస్తే ఈ మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించనుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటవ్వగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది.