టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన హర్షిత్ రాణాను గంభీర్ మందలించాడని, సరిగ్గా ఆడకపోతే జట్టు నుంచి తప్పిస్తానని హెచ్చరించాడట. ఈ విషయాన్ని హర్షిత్ రాణా చిన్ననాటి కోచ్ శ్రవణ్ మీడియాకు వెల్లడించాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు హర్షిత్ రాణాను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ప్రియ శిష్యుడు కావడంతోనే హర్షిత్ రాణాకు మూడు ఫార్మాట్లలో అవకాశాలు దక్కుతున్నాయనే విమర్శలు వినిపించాయి. వీటిపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యూట్యూబ్ వ్యూస్ కోసం 23 ఏళ్ల క్రికెటర్‌ను విమర్శిస్తారా? అని మండిపడ్డాడు. తనను విమర్శించాలని, ఆటగాళ్లను కాదని స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో హర్షిత్ రాణా దారుణంగా విఫలమయ్యాడు. దాంతో సిడ్నీ వన్డేకు ముందు రాణాను గంభీర్ తీవ్రంగా మందలించాడట. ఈ విషయాన్ని హర్షిత్ రాణానే తనకు ఫోన్ చేసి చెప్పాడని శ్రవణ్ తెలిపాడు. 'ఆఖరి వన్డేకు ముందు హర్షిత్ రాణా నాకు ఫోన్ చేశాడు. తన ప్రదర్శనపై బయట నుంచి వస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. దీంతో నిన్ను నువ్వు నమ్మకో అని చెప్పాను. కొందరు మాజీ క్రికెటర్లు కోచ్ గంభీర్‌కు హర్షిత్ రాణా ప్రియ శిష్యుడని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ అందులో వాస్తవం లేదు.

ప్రతిభ ఎక్కడ ఉండో గుర్తించి.. వారికి గంభీర్ మద్దతుగా ఉంటాడు. చాలా మంది క్రికెటర్లకు అతను అండగా నిలిచాడు. వారంతా కెరీర్‌లో అద్భుతాలు చేశారు. సరిగ్గా ఆడకపోతే గంభీర్ మందలిస్తాడు. హర్షిత్ రాణాను కూడా తీవ్రంగా హెచ్చరించాడు. రాణా ఇంకా 23 ఏళ్ల కుర్రాడే. అతనికి కొంత సమయం ఇవ్వాలి. యూట్యూబ్ వ్యూస్ కోసం కుర్రాళ్లపై విమర్శలు గుప్పించడం సరికాదు.'అని శ్రవణ్ చెప్పుకొచ్చాడు.
ఆఖరి వన్డేలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు హర్షిత్ రాణాను తిట్టిన క్రిష్ శ్రీకాంత్ కూడా ఫిదా అయ్యాడు. ప్రశంసల జల్లు కురిపించాడు.