టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. తన పర్యవేక్షణలోనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ గెలిచిందని చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనలోనూ మెరుగైన ఫలితాలు సాధించిందని గుర్తు చేశాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం నేపథ్యంలో నిందలు ఎదుర్కొవడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపాడు.
తాను హెడ్ కోచ్‌గా కొనసాగే విషయంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశాడు. జట్టు కంటే ఎవరూ గొప్ప కాదని, తాను ముందు నుంచే ఇదే చెబుతున్నానని పేర్కొన్నాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో బుధవారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో సౌతాఫ్రికా 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది.

93 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా వరుసగా రెండో ఏడాది సొంతగడ్డపై క్లీన్ స్వీప్ అయ్యింది. గంభీర్ పర్యవేక్షణలోనే టీమిండియా ఈ రెండు ఘోర పరాజయాలను చవిచూసింది. గతేడాది ఇదే సమయంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0తో కోల్పోయింది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా.. తొలిసారి సొంతగడ్డపై టీమిండియాను క్లీన్ స్వీప్ చేసింది.
ఈ ఘోర పరాజయం తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్‌ను హెడ్ కోచ్‌గా తన భవితవ్యంపై ప్రశ్నించగా సూటిగా సమాధానమిచ్చాడు. 'హెడ్ కోచ్‌గా నేను కొనసాగేది లేనిది బీసీసీఐ నిర్ణయించాల్సిన విషయం. నేను గతంలోనే చెప్పాను. భారత క్రికెట్ కంటే ఎవరూ ముఖ్యం కాదు. అది నేనైనా ఎవరైనా, అయితే కోచ్‌గా నేను ఇంగ్లండ్‌లో ఫలితాలు సాధించాను. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచిన వ్యక్తిని నేనే. ఈ జట్టు నేర్చుకునే దశలో ఉంది. కుర్రాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి.
ఈ ఓటమికి జట్టులోని ప్రతీ ఒక్కరు బాధ్యత వహించాల్సిందే. అందరూ నిందను ఎదుర్కోవాల్సిందే. అది నా నుంచే మొదలవుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలంటే.. టెస్ట్ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకొని ప్రాధాన్యత ఇవ్వాలి. సమష్టిగా రాణించడంపై కృషి చేయాలి. ఆటగాళ్లను లేదా ఒక వ్యక్తిని నిందించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.