Gautam Gambhir: కేఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగే టీమిండియా కొంపముంచింది
World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ ముగిసి మూడు రోజులు గడుస్తున్నా.. టీమిండియా ఫైనల్ ఓటమిపై విశ్లేషణలు ఆగడం లేదు. టీమిండియాదే అని భావించిన ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోవడంతో భారత అభిమానులంతా దు:ఖంలో మునిగిపోయారు. వరుసగా పది విజయాలతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా.. తుదిపోరులో ఓడటంపై మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ చానెల్‌తో మాట్లాడిన టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో ఫైనల్లో టీమిండియా ఓటమికి కేఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగే కారణమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. కనీసం బౌండరీలు కొట్టేందుకు కూడా ప్రయత్నించకపోవడం దారుణమని విమర్శించాడు.

రిస్క్ తీసుకొని షాట్లు ఆడితేనే టీమిండియాకు భారీ స్కోర్ లభించేదని తెలిపాడు. 'ప్రపంచకప్ ఫైనల్లో గెలవాలంటే ధైర్యంగా ఆడాలి. భాగస్వామ్యాలు నెలకొల్పాలన్న భారత ఆటగాళ్ల ప్రయత్నాన్ని అర్థం చేసుకోగలను. కానీ 11 నుంచి 40 ఓవర్ల వరకూ బౌండరీలు కొట్టకుండా ఆడటం సరికాదు. ఎవరో ఒకరు రిస్క్ చేయాల్సింది.
తొలి ఆరు ఏడుగురు బ్యాటర్లు రిస్క్ చేసి దూకుడుగా ఆడి ఉంటే బాగుండేది. అప్పుడు150 పరుగులకు ఆలౌటైనా నాకు నచ్చేది. కానీ ప్రపంచకప్ ఫైనల్ వంటి బిగ్ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యం ఏ మాత్రం సరిపోదు. రిస్క్ చేసి షాట్లు ఆడి ఉంటే కొడితే 300 ప్లస్ రన్స్ చేసేవాళ్లు. లేదంటే 150 పరుగులకు ఆలౌట్ అయ్యేవాళ్లు.
భారత జట్టులో లోపించింది ఇదే. అందుకే ఐసీసీ టోర్నమెంట్లను గెలవలేకపోతున్నాం. తాను ఔటైనా.. మిగతా వాళ్లు దూకుడుగా ఆడాలని మ్యాచ్‌కు ముందు రోహిత్ జట్టు ఆటగాళ్లకు చెప్పి ఉండాల్సింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్ టీమిండియాకు తీవ్రని నష్టం చేసింది. కోహ్లీ నిదానంగా ఆడుతున్నప్పుడు రాహుల్ దూకుడుగా ఆడాల్సింది.
కానీ రాహుల్ కూడా జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించడంతో ప్రత్యర్థి బౌలర్లకు మరింత బలం చెకూరింది. అదే జోరులో చెలరేగిన బౌలర్లు భారత్ పతనాన్ని శాసించారు. ధాటిగా ఆడుంటే బౌలర్లు ఒత్తిడికి గురై తప్పిదాలు చేసేవారు. ధైర్యం చేసి భారీ షాట్లు ఆడిఉంటే 310 స్కోర్ చేసుండేవాళ్లం. ప్రపంచకప్ ఛాంపియన్లుగా నిలిచేవాళ్లం. 240 పరుగుల లక్ష్యం సరిపోతుందిలే అని అనుకోవడానికి ఇదేమీ 1990 కాదు కదా'గౌతమ్ గంభీర్ ప్రశ్నించాడు.
ఫైనల్‌కు ముందు భారీ స్కోర్లు నమోదు చేసిన భారత్ కీలక పోరులో మాత్రం 240 పరుగులకే ఆలౌటైంది. మొదటి పది ఓవర్లలో 80 పరుగులు చేసిన భారత్. మిగతా 40 ఓవర్లలో కేవలం 160 పరుగులు చేయగలిగింది. అందులో కేవలం నాలుగు ఫోర్లు మాత్రమే ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications