టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టు ఘోర పరాజయాలకు ఆటగాళ్లను బాధ్యులను చేస్తూ గంభీర్ తీసుకొచ్చిన కఠిన ఆంక్షలపై అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ రూల్స్.. క్రికెటర్ల స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని మండిపడుతున్నారు.
ఇక ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణ ప్రదర్శనపై సమీక్ష సమావేశం నిర్వహించిన బీసీసీఐ.. డ్రెస్సింగ్ రూమ్‌ను గాడిన పెట్టేందుకు గంభీర్ సూచనలతో 10 కఠిన నియమాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రూల్స్ పాటించని ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కదని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది.

ఆటగాళ్ల ఆత్మ గౌరవంపై ఆంక్షలా..?
జట్టులో స్టార్క్ సంస్కృతికి తెరదించేందుకు నడుం బిగించింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బందిని అనుమతించడంపై ఆంక్షలు విధించింది. మ్యాచ్ ప్రాక్టీస్ ఎగ్గొట్టడం.. మ్యాచ్‌ల సందర్భంగా సొంత వాహనాల్లో ప్రయాణించడంపై నిషేధం విధించింది. ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని పేర్కొంది. లగేజి విషయంలోనూ కొత్త రూల్స్‌ను ప్రవేశ పెట్టింది.
విదేశీ పర్యటనల సమయంలో ఎలాంటి పర్సనల్ షూట్స్ లేదా ఎండార్స్‌మెంట్స్‌లో పాల్గొనడానికి వీలు లేదని తెలిపింది. అయితే ఈ రూల్స్ ఆటగాళ్ల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉన్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
హెడ్ కోచ్‌వా? హెడ్ మాస్టర్‌వా..?
భారత జట్టుకు ఆడే ఆటగాళ్లు స్కూల్ పిల్లలు కాదని, ప్రొఫెషనల్ క్రికెట్ స్టార్స్ అని చురకలింటిస్తున్నారు. అసలు గంభీర్ హెడ్ కోచ్? లేక హెడ్ మాస్టర్..? అని ప్రశ్నిస్తున్నారు. కఠిన ఆంక్షలతో మెరుగైన ప్రదర్శన రాదని, ఆటగాళ్లు స్వేచ్ఛగా ఉంటేనే రాణిస్తారని సూచిస్తున్నారు. గతంలో అనిల్ కుంబ్లే కూడా ఇలానే ఆటగాళ్లపై పెత్తనం చెలాయించి పదవి కోల్పోయాడని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు.
ప్రస్తుతం ఆటగాళ్ల బ్యాడ్ టైమ్ నడుస్తుండటంతో గంభీర్‌ను వ్యతిరేకించడం లేదని, లేకుంటే అతని పదవికి ఎప్పుడో ఎసరు వచ్చేదని అభిప్రాయపడుతున్నారు.
శాస్త్రి, ద్రవిడ్ ఎలా గెలిపించాడు..?
ఎలాంటి నిబంధనలు లేకుండానే రవి శాస్త్రి, రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా మెరుగైన ఫలితాలను సాధించిందని గుర్తు చేస్తున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్, 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిందని చురకలంటిస్తున్నారు.
ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా కైవసం చేసుకుందని కామెంట్ చేస్తున్నారు. జట్టు వైఫల్యాలకు ఆటగాళ్లతో పాటు కోచ్‌గా గంభీర్ పాత్ర కూడా ఉందని, అతని అనాలోచిత నిర్ణయాలు, వ్యూహాత్మక తప్పిదాలు టీమ్ పతనాన్ని శాసించాయని కామెంట్ చేస్తున్నారు.
సర్వ నాశనం..
అయితే దేశవాళీ క్రికెటర్లకు సెలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వనంత వరకు ఏ ఆటగాడు కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడరని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ముందుగా బీసీసీఐ, సెలెక్టర్లు దేశవాళీ క్రికెట్‌లో రాణించే ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. గంభీర్ కారణంగా భారత క్రికెట్ నాశనమయ్యేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.