తిరుపతి: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. బుధవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నాడు. స్వామి వారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గంభీర్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు.
ఆలయ అధికారులు గౌతమ్ గంభీర్‌ను సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గంభీర్ తిరుమల దర్శనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన గంభీర్.. ఈ సారి వన్డే ప్రపంచకప్ గెలుచుకునేందుకు టీమిండియాకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.

140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో పాటు తిరుమల వెంకన్న ఆశీస్సులతో ఈసారి టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఎక్స్‌పర్ట్ ప్యానల్ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొంటూ వివిధ టీమ్స్ బలబలాలు, బలహీనతలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు.
ప్రపంచకప్ గెలవాలంటే ఏ ఒక్కరి ప్రదర్శన వల్లనో సాధ్యం కాదని, సమష్టి ప్రదర్శన కనబరిస్తేనే విజయం దక్కుతుందని అనేకసార్లు చెప్పాడు. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తమ ప్రపంచకప్ క్యాంపయిన్‌ను ప్రారంభించనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.