ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. వన్డే ఫార్మాట్‌లో మరో ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. సమష్టి ప్రదర్శనతో టీమిండియా ఈ విజయం సాధించింది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా.. ప్రతీ మ్యాచ్‌లో ఎవరో ఒకరు సత్తా చాటడంతో ఓటమెరుగని జట్టుగా టైటిల్ అందుకుంది.
ఈ విజయంలో టీమిండియా ఆటగాళ్ల పాత్ర ఎంత ఉందో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ది కూడా అంతే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే టీమిండియా అన్‌సంగ్ హీరో అతనే. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. కానీ అతనికి ఊహించని ఫలితాలు, సవాళ్లు ఎదురయ్యాయి.

వరుస ఓటములు..
కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి వన్డే సిరీస్‌లోనే టీమిండియా ఓటమిపాలైంది. శ్రీలంక పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. 28 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. టీ20ల్లో విజయాలు సాధించినా.. టెస్ట్ ఫార్మాట్ ఘోర పరాజయాలను చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్ అయ్యింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడం అదే తొలిసారి.
అనంతరం ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా టీమిండియా కోల్పోయింది. ఈ పరాజయంతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. దాంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వరుస ఓటములతో అతని భవితవ్యంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఛాంపియన్స్ ట్రోఫీనే అతనికి ఆఖరికి ఛాన్స్ అనే ప్రచారం కూడా జరిగింది.

గంభీర్ నిర్ణయాలపై దుమారం..
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గంభీర్.. టీమిండియాను తనదైన వ్యూహాలతో నడిపించాడు. టోర్నీ ఆరంభానికి ముందే తనకు కావాల్సిన జట్టును ఎంచుకున్నాడు. దుబాయ్ పిచ్‌కు తగ్గట్లు ఐదుగురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకున్నాడు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ అవేవి అతను పట్టించుకోలేదు. తుది జట్టులో ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఆడించి ఫలితాన్ని రాబట్టాడు. తద్వారా తన నిర్ణయం సరైందని నిరూపించాడు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్‌ను ఐదో స్థానంలో ఆడించడాన్ని కూడా క్రికెట్ విశ్లేషకులు తప్పుబట్టారు. కానీ ఆ నిర్ణయమే టీమిండియాను విజేతగా నిలబెట్టింది. ఈ టోర్నీలో శ్రేయస్ అయ్యర్‌తో కలిసి అక్షర్ పటేల్ కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. అన్నిటి కంటే వరుణ్ చక్రవర్తీని భారత జట్టులోకి తీసుకోవడం గంభీర్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం.

తిప్పేసిన వరుణ్ చక్రవర్తీ..
ఈ టోర్నీ ముందు వరకు వరుణ్ చక్రవర్తీకి వన్డేలు ఆడిన అనుభవం లేదు. కేవలం టీ20ల్లో మాత్రమే రాణించాడు. అయినా రిస్క్ చేసి వరుణ్ చక్రవర్తీని ఆడించడమే కాకుండా.. తుది జట్టులోకి తీసుకున్నాడు. అతను అసాధారణ ప్రదర్శనతో మూడు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంత పెద్ద విజయం సాధించినా.. అతను ఓ చిరునవ్వుతోనే ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాడు.
గంభీర్ అరుదైన రికార్డ్..
ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో గంభీర్ ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆటగాడి.. కోచ్‌గా ఐసీసీ ట్రోఫీలు సాధించిన జాబితాలో చేరిన ఐదో వ్యక్తిగా నిలిచాడు. టీమిండియా గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో గంభీర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కోచ్‌గా ఆటగాడిగా ఐసీసీ టైటిల్స్ గెలిచిన జాబితాలో రాహుల్ ద్రవిడ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు డారెన్ లెమాన్, జియోఫ్ మార్ష్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టెన్‌లు మాత్రమే ఉన్నారు.