ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలవడం ముఖ్యం.. అవసరమైతే వారిని పక్కనపెట్టాలి: గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ కంటే వన్డే ప్రపంచకప్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలవడమే ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా పకడ్బందీగా సిద్దం కావాలని సూచించాడు. అవసరమైతే ఈ మెగా టోర్నీ కోసం ఐపీఎల్ 2023 సీజన్ ఆడకుండా ఆటగాళ్లను పక్కనపెట్టాలని కూడా తెలిపాడు. దాదాపు రెండున్నర నెలలపాటు ఐపీఎల్ జరగనుందని, ఆటగాళ్లపై పనిఒత్తిడి భారం కాకుండా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేయాలని గంభీర్ సూచించాడు. అందుకోసం ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

భారత్ క్రికెట్‌కే ప్రాధాన్యత..
ఐపీఎల్ కంటే భారత్ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ కోసం సన్నద్ధత కోసం కీలక ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడించకపోయినా ఫ్రాంచైజీలు బాధపడకూడదని చెప్పాడు. ప్రపంచకప్ కంటే ఏదీ ముఖ్యమైంది కాదని స్పష్టం చేశాడు. 'ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023ను దృష్టిలో పెట్టుకొని భారత భవిష్యత్తు పర్యటనల ప్రణాళిక ఉంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో పాల్గొనే టాప్ ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫామ్‌పై ఎప్పటికప్పుడు ఫ్రాంచైజీలతో కలిసి నేషనల్ క్రికెట్ అకాడమీ పర్యవేక్షించాలి'అని గంభీర్ సూచించాడు.

ఫ్రాంచైజీలు ఇబ్బంది పడినా..
'2023లో మాత్రం భారత క్రికెట్ ప్రధాన లక్ష్యం వన్డే ప్రపంచ కప్ టోర్నీనే కావాలి. ఈ సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు కాస్త ఇబ్బంది పడొచ్చు. అయితే అంతిమంగా భారత జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఎవరైనా పెద్ద ప్లేయర్ ఐపీఎల్‌ను మిస్ అయితే వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే ఐపీఎల్ ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుంది. వరల్డ్ కప్ అనేది నాలుగేళ్లకొకసారి మాత్రమే వస్తుంటుంది. నా వరకైతే ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గడం కంటే ప్రపంచకప్‌ను సాధించడం చాలా ముఖ్యం. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఉత్తమ జట్టును సిద్ధం చేయాలి.

ప్రతీ వన్డే ఆడాలి..
ఎవరికైనా విశ్రాంతి కావాలంటే వారికి టీ20 సిరీస్‌లకు ఇవ్వాలి. అంతేగానీ వన్డేల నుంచి మాత్రం పక్కన పెట్టకూడదు. మెగా టోర్నీ బరిలోకి దిగే జట్టు సభ్యులు కలిసి ఆడేలా చూడాలి. ఇదే గత రెండు ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ చేసిన అతి పెద్ద తప్పిదం. వేర్వేరు సిరీస్‌లకు వేర్వేరు జట్లను ప్రకటించి ఇబ్బంది పడింది. అత్యుత్తమ తుది జట్టుతో ఎన్ని మ్యాచ్‌లు ఆడింది..? ప్రపంచకప్ సమయంలో కేవలం వారిపైనే దృష్టి పెడితే బాగుంటుంది'అని గంభీర్ తెలిపాడు. ప్రస్తుతం గంభీర్ ఐపీఎల్‌లోని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీకి మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications