న్యూఢిల్లీ: టీమిండియా వన్డే ప్రపంచకప్ కాంబినేషన్‌లో ముగ్గురు లెఫ్టాండర్స్ ఉండేలా చూసుకోవాలని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి చేసిన సూచనలను మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. ఇది పనికిమాలిన ఆలోచనంటూ ఫైర్ అయ్యాడు. ఓ ఆటగాడి ఫామ్, ప్రభావాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని జట్టులోకి ఎంపిక చేయాలి కానీ లెఫ్టాండరా? రైట్ హ్యాండారా? అనేది చూడవద్దన్నాడు.
ముగ్గురు లెఫ్టాండర్స్ కంటే నాణ్యమైన ఆటగాళ్లు జట్టులో ఉండటం ముఖ్యమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్ 2023 కోసం భారత జట్టును ప్రకటించకముందే.. టీమిండియా కాంబినేషన్‌పై చర్చించిన రవి శాస్త్రి.. టాప్-7 బ్యాటర్లలో ముగ్గురు లెఫ్టాండర్స్ ఉండాలని తెలిపాడు. తాజాగా ఈ సలహాపై స్పందించిన గంభీర్.. తీవ్రంగా తప్పుబట్టాడు.

'ఓ ఆటగాడు లెఫ్టాండరా? రైట్ హ్యాండరా? అనేది అనవసరం. అసలు జట్టులో ముగ్గురు లెఫ్టాండర్స్ ఉండాలనే ఆలోచనే పనికిమాలినది. ఆటగాళ్ల క్వాలిటీ చూడలి తప్పా? లెఫ్టాండర్స్ ఎంతమంది ఉన్నారనేది అనవసం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే మంచి ప్లేయర్ ఉంటే చాలు. అతను లెఫ్టాండర్, రైట్ హ్యాండర్ అనేది అనవసరం.
కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మెరుగ్గా రాణిస్తే వారిని తీసుకోవాలి. ఫామ్‌లో లేకపోయినా లెఫ్టాండర్స్‌ను తీసుకోవడం సరికాదు. అసలు ఈ ఎడమ చేతివాటం ఆటగాళ్ల చర్చనే అనవసరం. లెఫ్టాండర్ కావాలంటే యశస్వీ జైస్వాల్ ఉన్నాడు. ఆటగాళ్ల క్వాలిటీ ముఖ్యం కానీ క్వాంటిటీ అవసరం లేదు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ముగ్గురు లెఫ్టాండర్స్ తీసుకోవాలనుకున్నా వారి జట్టులో ఎక్కడ? ఎవరి ప్లేస్‌లోఆడించాలో చెప్పాలని తన యూట్యూబ్ చానెల్ వేదికగా ప్రశ్నించాడు. చెప్పినంత సులువుగా ఇది ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడు. టాప్-3లో రోహిత్, శుభ్‌మన్ గిల్ ఫిక్స్ అని, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఆడుతారని, ఏడో స్థానంలో మాత్రమే లెఫ్టాండర్ అయిన జడేజా ఆడుతాడని చెప్పాడు.
మరో ఇద్దరు లెఫ్టాండర్స్‌ను ఆడించాలంటే ఎవర్నీ తప్పించాలని ప్రశ్నించాడు. రవి శాస్త్రి మాత్రం నాలుగో స్థానంలో తిలక్ వర్మను ఆడించాలని సూచించాడు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ పరిగణలోకి తీసుకొని రోహిత్‌తో ఓపెనింగ్ చేయించాలని అభిప్రాయపడ్డాడు.