ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌ను డ్రా చేసుకోవడంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సంతోషం వ్యక్తం చేశాడు. భారత జట్టు అద్వితీయమైన పోరాటంతోనే ఇది సాధ్యమైందని కొనియాడాడు. గాయంతో బ్యాటింగ్ చేసిన రిషభ్ పంత్‌ను ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అజేయ శతకాలతో చెలరేగి టీమిండియాను గట్టెక్కించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతం గంభీర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తమ ఆటగాళ్ల సెంచరీల ముందు డ్రా కోసం ప్రయత్నించిన బెన్ స్టోక్స్ తీరును తప్పుబట్టాడు.
'ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం గర్వంగా ఉంది. చాలా మంది మా జట్టును తక్కువ అంచనా వేసారు. కానీ మా ఆటగాళ్లు అద్భుతమైన పోరాటంతో ఓటమి నుంచి గట్టెక్కించారు. దేశం కోసం మా ఆటగాళ్లు పోరాడుతారు. శుభ్‌మన్ గిల్ ప్రతిభపై ఎలాంటి సందేహం అవసరం లేదు. క్రికెట్ గురించి తెలియని వారికే అతనిపై సందేహాలు ఉంటాయి. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ ఏ మాత్రం భారం కాదు.

రిషభ్ పంత్ కాలికి గాయమవ్వడంతో ఆఖరి టెస్ట్‌కు దూరమయ్యాడు. విరిగిన కాలుతో బ్యాటింగ్ చేసిన రిషభ్ పంత్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. అతని పోరాటం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది.'అని గంభీర్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌ను ముందుగానే డ్రా చేయాలని బెన్ స్టోక్స్ కోరడాన్ని గంభీర్ తప్పుబట్టాడు. ఇది సరైన చర్య కాదని, ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా సెంచరీలకు చేరువగా ఉంటే స్టోక్స్ డ్రాకు అంగీకరించేవాడా? అని ప్రశ్నించాడు. 'జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీలకు చేరువైనప్పుడు డ్రాకు ఎలా అంగీకరిస్తాం. బెన్ స్టోక్స్ అలా ఎలా అడుగుతాడు? ఇంగ్లండ్ ఆటగాళ్లే ఇలా సెంచరీకి చేరువగా ఉన్నప్పుడు అతను ఇలానే డ్రాకు ఒప్పుకునేవాడా? జడేజా, సుందర్ సెంచరీలు చేసుకోవడానికి పూర్తి అర్హులు. మేం ఎవర్నీ సంతోషపెట్టడానికి ఆడటం లేదు. జట్టు గెలుపు కోసం మాత్రమే ఆడుతున్నాం.'అని గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
బుమ్రా ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడకపోయినప్పటికీ.. జట్టులోని పేసర్లంతా ఫిట్‌గానే ఉన్నారని గంభీర్ స్పష్టం చేశాడు. ఆఖరి టెస్ట్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేయడమే తమ లక్ష్యమని చెప్పాడు.