
ఇగోను పక్కనపెట్టి..
అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ మ్యాచ్ షోలో మాట్లాడిన గంభీర్.. విరాట్ క్రమశిక్షణతో ఆడుతూ ఆకట్టుకున్నాడని తెలిపాడు. అతడి షాట్ సెలెక్షన్ మెరుగ్గా ఉందని చెప్పాడు. ‘విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు ఆటగాళ్లు తమ ఇగోను వదిలేసి వెళ్లాలని కోహ్లీ ఇంతకు ముందే పలుమార్లు చెప్పాడు. గతంలో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా అతను ఇదే మాట అన్నాడు. నేడు ఆ మాటను కోహ్లీ నిరూపించుకున్నాడు. ఎంతో సహనంతో బ్యాటింగ్ చేశాడు.

సవాల్ విసిరినా..
సఫారీ బౌలర్లు వైవిధ్యమైన బంతులతో సవాల్ విసిరినా ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. సహచర ఆటగాళ్ల నుంచి సరైన సహకారం అందకున్నా.. క్రమశిక్షణతో బ్యాటింగ్ చేశాడు. బలహీనతను అధిగమిస్తూ.. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను వదిలేశాడు. బౌలర్లపై ఆధిపత్యం చెలాయించకుండా తన పని తాను చేసుకుపోయాడు. తన అహాన్ని పక్కన పెట్టి జట్టుకోసం విలువైన ఇన్నింగ్స్ ఆడాడు' అని గంభీర్ కొనియాడాడు.

మాజీ క్రికెటర్లు సైతం..
ఇక విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు విరాట్ ఆటను కొనియాడుతున్నారు.
కోహ్లీ సెంచరీ అందుకోలేకపోయినా.. అంతకు మించిన గొప్ప ఇన్నింగ్స్ ఇదని ప్రశంసిస్తున్నారు. బ్యాటర్లకు సవాల్ విసిరే కేప్ టౌన్ పిచ్‌పై కోహ్లీ గొప్పగా రాణించాడని మెచ్చుకున్నారు. 'కోహ్లీ తొలి ఇన్నింగ్స్ ఆసాంతం తన క్లాస్ బ్యాటింగ్‌తో కట్టిపడేశాడు' అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేయగా.. వసీం జాఫర్, ఆర్పీ సింగ్, ఆకాశ్ చోప్రా, దినేశ్ కార్తిక్ తదితరులు కూడా కోహ్లీని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.

కోహ్లీ మినహా..
ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమవడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 77.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (201 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 79) అర్ధ సెంచరీ సాధించగా, చతేశ్వర్ పుజారా (77 బంతుల్లో 7 ఫోర్లతో 43) ఫర్వాలేదనిపించాడు. రబడా 73 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జాన్సెన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (3)ను బుమ్రా అవుట్ చేయగా... మార్క్‌రమ్ (8 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.


Click it and Unblock the Notifications
