న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటేనే విమర్శలు ఎక్కుపెట్టే మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్.. తాజాగా అతని గురించి సానుకూలంగా మాట్లాడాడు. ఆసియాకప్ టోర్నీ చరిత్రలో విరాట్ కోహ్లీ ఆడిన ఓ ఇన్నింగ్సే అత్యుత్తమైనదని అభిప్రాయపడ్డాడు. అవకాశం వచ్చినప్పుడల్లా విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించే గంభీర్.. సానుకూలంగా మాట్లాడటం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఐపీఎల్ 2014 సందర్భంగా ఈ ఇద్దరి మధ్య గొడవ జరగా.. అప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా విరాట్ కోహ్లీపై గంభీర్ విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించేదాకా ఈ విమర్శలను కొనసాగించాడు. పదే పదే ఐపీఎల్ విజయాలను ప్రస్తావిస్తూ.. రోహిత్ శర్మ కెప్టెన్సీతో పొల్చుతూ టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చాడు.

టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కోహ్లీ పట్ల కాస్త సానుకూలంగా వ్యవహరించిన గంభీర్.. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా మైదానంలోనే గొడవపడ్డాడు. ఈ ఇద్దరూ ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లడంతో అత్యంత వివాదాస్పద ఘటనగా ఇది నిలిచిపోయింది. ఈ ఘటనతో గంభీర్‌పై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగినట్లేనని అంతా అనుకున్నారు.
కానీ ఆసియాకప్ 2023 నేపథ్యంలో ఓ చానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్.. కోహ్లీని కొనియాడాడు. 'ఆసియాకప్‌లో విరాట్ కోహ్లీ ఆడిన 183 పరుగుల ఇన్నింగ్స్ అత్యుత్తమమైనది. పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 330 పరుగుల లక్ష్యచేధనలో కోహ్లీ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్ర ఒత్తిడిలో తనదైన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు.
పాకిస్థాన్‌తో హై ఓల్టేజ్ సమరంలో భారీ లక్ష్యచేధనలో విరాట్ కోహ్లీ ఆడిన ఆ ఇన్నింగ్స్.. అంతకుముందు ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌లన్నిటినీ తుడిచి పెట్టేసింది. ఆ మ్యాచ్‌లో నేను డకౌటయ్యాను. ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ గెలవడం కష్టమనుకున్నాను. కానీ విరాట్ అసాధారణ బ్యాటింగ్‌తో విజయాన్ని అందించాడు. నా వరకూ ఆసియా కప్‌లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2012 ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 148 బంతుల్లో 22 ఫోర్లు, సిక్సర్‌తో 183 పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇప్పటికీ ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ టాప్‌లోనే కొనసాగుతున్నాడు.