జస్‌ప్రీత్ బుమ్రాతో గొడవ పడిన విషయంలో ఆస్ట్రేలియా యువ బ్యాటర్ సామ్ కొన్‌స్టాదే తప్పని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఉస్మాన్ ఖవాజా, జస్‌ప్రీత్ బుమ్రా మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో కొన్‌స్టాస్ జోక్యం చేసుకోవడం సరికాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బుమ్రాతో కొన్‌స్టాస్ గొడవపడ్డాడు.
ఆ మరుసటి బంతికే ఉస్మాన్ ఖవాజాను బుమ్రా ఔట్ చేయగా.. భారత ఆటగాళ్లు కొన్‌స్టాస్ వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సెలెబ్రేషన్స్‌ను ఆస్ట్రేలియా కోచ్ మెక్‌డొనాల్డ్ తప్పుబట్టాడు. భారత ఆటగాళ్ల సంబరాలు కాస్త భయపట్టేలా ఉన్నాయని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్‌ను బుమ్రా-కొన్‌స్టాస్ గొడవపై ప్రశ్నించగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు. 'కఠినమైన ఆటలో సున్నితంగా ఉండలేరు. అలాగని ఎవరూ బెదిరింపులకు దిగరు. బుమ్రాతో గొడవ విషయంలో కొన్‌స్టాస్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అతనికి అక్కడ మాట్లాడే హక్కే లేదు. బుమ్రా, ఉస్మాన్ ఖవాజా సంభాషించుకుంటున్నప్పుడు మధ్యలో అతని వెళ్లాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ కోసం స్ట్రైకింగ్‌లో ఉన్న ఆటగాడు, అంపైర్, బౌలర్ మాత్రమే మాట్లాడుకొనే అంశం. అక్కడ కొన్‌స్టాస్ మాట్లాడాల్సిన అవసరం లేదు'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఓ హెడ్ కోచ్‌గా జట్టులోని ప్రతీ ఒక్కరిని సమానంగా చూసే బాధ్యత తనదని తెలిపాడు. 100 టెస్ట్‌లు ఆడిన ఆటగాడిని.. అరంగేట్ర ప్లేయర్‌ను ఒకేలా చూస్తానని స్పష్టం చేశాడు. 'జట్టులో అందర్నీ సమానంగా చూసే బాధ్యత నాది. కొందరికి ప్రాధాన్యం ఇచ్చి మరికొందరిని తక్కువ చేయడం నాకు ఇష్టం ఉండదు. జట్టులోని ప్రతీ ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని నేను ఎప్పుడూ కోరుకుంటా. అందుబాటులో ఉన్నప్పుడు దేశవాళీ క్రికెట్ తప్పకుండా ఆడాలి. సుదీర్ఘ ఫార్మాట్‌లో నిబద్దతతో ఆడాలనుకుంటే దేశవాళీ క్రికెట్‌ను మరిచిపోకూడదు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన ఐదో టెస్ట్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ బెర్త్‌ను కూడా ఖాయం చేసుకుంది.
162 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 27 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఉస్మాన్ ఖవాజా(45 బంతుల్లో 4 ఫోర్లతో 41)రాణించగా.. ట్రావిస్ హెడ్(38 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్), బ్యూ వెబ్‌స్టర్(34 బంతుల్లో 6 ఫోర్లతో 39) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/65) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/69) ఒక్క వికెట్ పడగొట్టాడు. గాయంతో బుమ్రా బౌలింగ్ చేయకపోవడం ఆసీస్‌కు కలిసొచ్చింది.