బుమ్రాకు ఊపిరి పీల్చుకునే సమయమివ్వాలి.. ఇంగ్లండ్‌తో రెస్ట్ ఇవ్వాలి: గంభీర్

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు కావాల్సిన విశ్రాంతి ఇవ్వాలని, పని ఒత్తిడి పడకుండా చూసుకోవాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు మాజీ బ్యాట్స్‌మన్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సూచించాడు. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి బుమ్రా ఏకధాటిగా క్రికెట్ ఆడుతున్నాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో యార్కర్ల కింగ్ గాయంపై మాట్లాడుతూ ఈ బీజేపీ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో తలపడే 4 టెస్టులు, 5టీ20లు, 3 వన్డేల్లో అన్నిటిలో అతన్ని ఆడించడం సరికాదన్నాడు. రొటేషన్ పద్దతిలో ఇతర బౌలర్లకు అవకాశమిచ్చి బుమ్రాకు ఊపిరి పీల్చుకునే సమయమివ్వాలన్నాడు.

ఇంగ్లండ్‌తో విశ్రాంతి ఇవ్వాలి..
'బుమ్రా బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీర్ఘ కాలంలో అతనే ప్రధాన పేసర్‌గా టీమిండియాను నడిపిస్తాడు. కాబట్టి అతను ఫిట్‌గా ఉండడం చాలా ముఖ్యం. ఇక రాబోయే ఇంగ్లండ్ సిరీస్‌కు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ ఫిట్‌గా లేరని తెలుసు. అంత మాత్రాన బుమ్రాను నాలుగు టెస్టుల్లో ఆడించడం సరికాదు. ఇప్పటివరకు అతను స్వదేశంలో టెస్టు క్రికెట్ ఆడనేలేదు. కాబట్టి టీమిండియా అతని విషయంలో జాగ్రత్తగా ఉందనే అనుకుంటున్నా' అని గంభీర్ పేర్కొన్నాడు.

వర్క్‌లోడ్ చూడాలి..
టీమిండియా బుమ్రాను కేవలం విదేశాల్లోనే ఆడించిందని, ఈ పేస్‌గుర్రం అక్కడ తన ప్రతాపం చూపించాడని ఈ టీమిండియా మాజీ ఓపెనర్ గుర్తు చేశాడు. 'బుమ్రాను ఎక్కువగా విదేశాల్లోనే ఆడించారు. అయితే అతను భారత్‌లో రాణించలేడనేది నా ఉద్దేశం కాదు. ఇక్కడ మరింత ప్రమాదకరంగా రాణిస్తాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరు క్రీజులో ఉన్నా ఔట్ చేయగల సమర్థుడు. కానీ అతని వర్క్‌లోడ్‌ను పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

బుమ్రా దూరం..
సిడ్నీ టెస్ట్‌లో పొత్తి కడుపు గాయానికి గురైన బుమ్రా.. బ్రిస్బేన్ టెస్ట్ బరిలోకి దిగలేదు. దాంతో అతని స్థానంలో టీ నటరాజన్ సంప్రదాయక ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. గాయంతో అశ్విన్ కూడా దూరమవడంతో సుంధర్ జట్టులోకి వచ్చాడు. అతనికి కూడా ఇది అరంగేట్ర మ్యాచే. అనుభవలేమి బౌలింగ్ విభాగంతో భారత తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ బోర్డర్-గవాస్కర్ సిరీస్‌తోనే సంప్రదాయక క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సిరాజే.. పేస్ విభాగాన్ని నడిపించడం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ లంచ్ బ్రేక్ సమయానికి 27 ఓవర్లలో 2 వికెట్లకు 65 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications