భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ జై షా ఆఫర్ చేసిన టీమిండియా హెడ్ కోచ్ పదవిని గంభీర్ తిరస్కరించినట్లు అర్థమవుతోంది. టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను నియమించారని మంగళవారం జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇదంతా నేషనల్ మీడియా హడావుడేనని స్పష్టమైంది.
తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్.. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మెంటార్‌గానే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌ను సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలబెట్టడమే తన లక్ష్యమని చెప్పాడు. కేకేఆర్ సక్సెస్ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిచేందుకు తాము మరో 3 టైటిళ్లు గెలవాల్సి ఉందని పేర్కొన్నాడు.

అదే మా లక్ష్యం..
'ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కంటే మాకు రెండు టైటిళ్లే తక్కువగా ఉన్నాయి. మా తాజా గెలుపుతో నేను సంతృప్తిగా ఉన్నాను. కానీ మేం ఇంకా మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ కాదు. అలా నిలవాలంటే మేం ఇంకా మూడు టైటిళ్లు గెలవాలి. అది జరగాలంటే మేం చాలా కష్టపడాలి.
మా తదుపరి లక్ష్యం కేకేఆర్‌ను మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలబెట్టడమే. అలా నిలిచినప్పుడు దక్కే ఫీలింగ్ కంటే మెరుగైనది ఏది లేదు. ఇప్పుడే మా ప్రయాణం మొదలైంది.
ఐపీఎల్ బరిలో నిలిచినప్పుడు ఎవరికైనా మొదటగా వచ్చే ఆలోచన ప్లే ఆఫ్స్ చేరడం. ప్లే ఆఫ్స్‌కు సమీపంగా వచ్చినప్పుడు టాప్-2లో నిలవడమే లక్ష్యం. టాప్-2లో నిలిచినప్పుడు ఫైనల్ చేరాలనుకుంటాం. ఆ తర్వాత టైటిల్ గెలవాలనుకుంటాం. ప్రతీ అడుగులో ఉత్సాహం, అనేక సవాళ్లు, ఆందోళనలు ఉంటాయి.
ఈ రోజు ఇంట్లో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఐపీఎల్‌లో ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. ఇది తీవ్ర పోటీ కలిగిన వరల్డ్ బెస్ట్ టీ20 లీగ్. ఇలాంటి టోర్నీల్లో విజేతగా నిలిస్తే వచ్చే సంతోషాన్ని మాటల్లో చెప్పలేం.
ఐపీఎల్ ముగియడంతో నా కుటుంబంతో వెకేషన్ వెళ్లాలనుకుంటున్నా. క్రికెట్‌లో కొనసాగాలంటే ఇలాంటి బ్రేక్ తీసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబంతో గడపడం కంటే మించింది ఏది లేదు. వరల్డ్ బెస్ట్ టీ20 లీగ్ గెలిచిన తర్వాత ఆ ఆనందాన్ని కుటుంబ సభ్యులతోనే పంచుకోవాలి.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.