శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ తనను బాగా ఇబ్బంది పెట్టిన బౌలరని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఎక్స్‌వేదికగా శుక్రవారం #AskGG పేరిట అభిమానులతో చిట్ చాట్ చేసిన గౌతమ్ గంభీర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అభిమానులు అడిగిన ప్రతీ ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పాడు.
ఈ చిట్ చాట్‌లో భాగంగా ఓ అభిమాని 'మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరు?'అని అడగ్గా.. గంభీర్ ముత్తయ్య మురళీధరణ్ పేరు చెప్పాడు. అతనొక్కడే తనను చాలా ఇబ్బంది పెట్టినట్లు పేర్కొన్నాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో మళ్లీ చేరడం సంతోషంగా ఉందని, బాద్‌షా షారుఖ్ ఖాన్ తన కుటుంబ సభ్యుడని ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. కేకేఆర్ అంటేనే ఓ ఎమోషన్ అని, ఆ జట్టులో భాగమయ్యేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. కోల్‌కతాలో తనకు 'ఫుచ్కాస్ రోల్స్'అనే ఫుడ్ ఇష్టమని తెలిపాడు.
క్రికెటర్లను హీరోలను చేయడం కంటే కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని మరో అభిమానికి చురకలంటించాడు. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున ఆడే బిగ్ మ్యాచ్ ప్లేయర్ ఎవరని సదరు నెటిజన్ అడగ్గా గంభీర్ ఘాటుగా స్పందించాడు. యువరాజ్ సింగ్ గురించి ఒక్క పదంలో చెప్పమంటే.. 'అల్టిమేట్ మ్యాచ్ విన్నర్'అని బదులిచ్చాడు.
భారత ఆర్మీలో చేరాలనేది తనకు తీరని కోరికని చెప్పాడు. అయినా ఎలాంటి పశ్చాతాపం లేదన్నాడు. వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేస్తావని ప్రశ్నించగా.. తాను ఏం ఫీల్ అవుతానో అదే మాట్లాడుతానని, వివాదాస్పదం చేయాలనుకున్నవారు చేస్తారని, అలా చేయడం ఎవరికి ఉపయోగం ఆలోచించాలని సదరు నెటిజన్‌కు గంభీర్ సూచించాడు.
నెగటివిటీని ఎలా భరిస్తావని, ప్రశాంతంగా ఎలా ఉంటావని మరో అభిమాని ప్రశ్నించగా..తనదైన శైలిలో గంభీర్ బదులిచ్చాడు. 'ఏది చివరిది కాదు. మనకు నచ్చినట్లు మనం ఉండటం ముఖ్యం. ప్రశాంతంగా ఉండాలంటే ఇదొక్కటే మార్గం'అని గంభీర్ తెలిపాడు.
రోజు రాత్రి పడుకునేముందు చేసే చివరి పని ఏంటని ప్రశ్నించగా.. అందమైన కూతుళ్లను చూసి తాను ఎంత అదృష్టవంతుడినోనని మురిసిపోతానని చెప్పాడు. చురకైన జ్ఞాపకశక్తి వెనుక ఉన్న సీక్రెట్ ఏంటని ప్రశ్నించగా.. హెల్తీ బోరింగ్ డైట్ అని, ఆల్కాహాల్, స్మోకింగ్ చేయకపోవడమని బదులిచ్చాడు. జీవితంలో అత్యంత మధురమైన క్షణం ఏదని ప్రశ్నించగా.. నటాషాను పెళ్లి చేసుకోవడమని గంభీర్ బదులిచ్చాడు.